ఆర్థికాభివృద్ధిలో పర్యాటక, ఆతిథ్య రంగాలే కీలకం

ఆర్థికాభివృద్ధిలో పర్యాటక, ఆతిథ్య రంగాలే కీలకం

కరోనా మహమ్మారి పర్యాటకం, ఆతిథ్య రంగాలపై పెను ప్రభావాన్ని చూపించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ రంగాలను ఆదుకునేందుకు అత్యవసర రుణసదుపాయ హామీ పథకాన్ని 4.5 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు. పర్యాటక, ఆతిథ్య రంగాలు ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మంచి పరిణామమన్నారు. పర్యాటక రంగాన్ని ఆదుకోవడం ద్వారా దీనికి సంబంధించిన ఉద్యోగాలను కాపాడటంతోపాటు వ్యాపారస్తులకు మేలు జరగాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 

పర్యాటక రంగంలో సుస్థిర పురోగతి, ఈకో టూరిజాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.  దేశార్థికాభివృద్ధిలో పర్యాటక, ఆతిథ్య రంగాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. 31 మార్చి 2023 వరకు ఈసీఎల్‌జీఎస్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మ్యారేజ్ హాళ్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, అడ్వెంచర్, చారిత్రక కట్టడాల నిర్వహణ తదితర ఆతిథ్య రంగంలోని వ్యాపారస్తులు, ఎంఎస్ఎంఈ లకు రుణసదుపాయ అర్హత ఉంటుందని చెప్పారు.