కేంద్ర నిధులతో ‘సోమశిల - కృష్ణా’ బ్రిడ్జి కట్టిస్తాం : కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే   

కేంద్ర నిధులతో ‘సోమశిల - కృష్ణా’ బ్రిడ్జి కట్టిస్తాం :  కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే   

గద్వాల/వనపర్తి, వెలుగు:  రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేలు మాఫియా డాన్ లలా మారి ప్రకృతినీ, ప్రజలనూ దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ‘నాగర్ కర్నూల్ లోక్ సభ ప్రవాస్ యోజన’ కోర్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పక్కన పెట్టి అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అభివృద్ధి జరుగుతోందన్నారు.

గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు ఖాతాల్లో వేస్తుంటే.. వాటిని కూడా సర్పంచులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. సోమశిల–కృష్ణా బ్రిడ్జి కొల్లాపూర్ ప్రజల చిరకాల స్వప్నమని, ప్రధాని మోడీ సారథ్యంలో రూ. 11 వేల కోట్లతో త్వరలోనే ఇక్కడ మోడల్ బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. ఈ బ్రిడ్జితో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, బీజేపీ నేతలు ఎ. రాజవర్ధన్ రెడ్డి, బంగారు శృతి, కట్టా సుధాకర్ రెడ్డి, కొల్లి మాధవి, బోసుపల్లి ప్రతాప్, రాగి రామకృష్ణారెడ్డి, జింకల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 
గద్వాలలో స్కూల్, హాస్పిటల్ తనిఖీ 
కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే గురువారం జోగులాంబ గద్వాల జిల్లాలోనూ పర్యటించారు. గద్వాల మండలం పుటాన్పల్లి దగ్గర ఉన్న ఎస్సీ గురుకుల స్కూల్​ను తనిఖీ చేశారు. స్టూడెంట్లతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ లో సరిపడా బాత్రూంలు, కూర్చోవడానికి బెంచీలు, సరిపడా క్లాస్ రూంలు లేవని స్టూడెంట్లు సమస్యలను ఏకరువుపెట్టారు. పగలు చదువుకుంటూ, రాత్రికి అదే రూంలో నిద్ర పోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. ఇండెంట్ పెట్టామని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కేంద్ర మంత్రి కలుగజేసుకుని.. తాను త్వరలోనే మళ్లీ ఇక్కడికి వస్తానని, అప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యాయా? లేదా? చూస్తానన్నారు.

స్థానిక సర్కార్ దవాఖానను కూడా ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన డీకే అరుణ నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి అలంపూర్ కు వెళ్లారు. అంతకుముందు కేంద్ర మంత్రిని కలిసిన రజకులు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతి పత్రం అందించారు. పెన్షన్ల సమస్య పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గడ్డం కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, స్నిగ్ధా రెడ్డి, బండల పద్మావతి, రజక నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.