పాత పింఛన్​ విధానాన్ని ప్రవేశ పెట్టాలని విన్నపం

పాత పింఛన్​ విధానాన్ని ప్రవేశ పెట్టాలని విన్నపం

కామారెడ్డి/కోటగిరి/ బాన్సువాడ, వెలుగు:  జిల్లాలో మూడోరోజు పర్యటించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు  వివిధ  వర్గాల ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి.  సీపీఎస్​  విధానాన్ని రద్దు చేసి పాత పెన్సన్​ విధానాన్ని ప్రవేశ పెట్టాలని కోరుతూ ఎంప్లాయీస్, యూనియన్ల లీడర్లు వినతి పత్రం అందజేశారు.  శనివారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి వచ్చిన మంత్రిని ఎంప్లాయీస్​ కలసి తమ  సమస్యలను విన్నవించారు.  సీపీఎస్​ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని మంత్రికి మొరపెట్టుకున్నారు. మంత్రిని కలిసిన వారిలో ప్రతినిధులు చింతల లింగం,  కృష్ణాకర్​రావు,  లక్ష్మణ్​,  సత్యనారాయణ, మదుసూధన్​,  మధు, సుధాకర్​రావు, చిరంజీవి, భవాని, సుజాత పాల్గొన్నారు.  317 జీవోతో  నిజామాబాద్​ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాకు బదిలీపై  వచ్చిన టీచర్లు కూడా  కేంద్ర మంత్రిని కలిశారు.  తమను పాత జిల్లాకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. 

ఘనంగా సన్మానం
గాంధారి మండల కేంద్రంలో బీజేపీ లీడర్లు, గిరిజన మహిళలు  కేంద్ర మంత్రిని  ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన  రైతు సమ్మేళనానికి నిర్మలా సీతారామన్​హాజరయ్యారు.  ఈ సందర్భంగా రైతు ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.   బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార,  కిసాన్​ సెల్​ ప్రెసిడెంట్​ పొతంగల్​ కిషన్​రావు, లీడర్లు మురళీధర్​గౌడ్​,  బాణాల లక్ష్మారెడ్డి,  కాటిపల్లి  వెంకటరమణారెడ్డి,  మర్రి బాపురెడ్డి, తేలు శ్రీనివాస్ పాల్గొన్నారు. 

గణేశ్ ​మండపం వద్ద  పూజలు
బాన్సువాడ పట్టణంలో గణేశ్ మండపం వద్ద శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పూజలు చేశారు. అంతకు ముందు ఎన్జీవో కాలనీలో ఆర్ఎస్ఎస్ నేత ఇంట్లో పార్టీ లీడర్లతో సమావేశమై పలు విషయాల గురించి చర్చించారు. బీజేపీ లీడర్లు  శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రాజాసింగ్, విఠల్, శ్యామ్ ఉన్నారు. 

కార్యకర్త ఇంట్లో టిఫిన్ ​చేసిన కేంద్ర మంత్రి
కోటగిరి మండలంలోని కొడిచర్ల గ్రామంలో బీజేపీ కార్యకర్త భీమ్‌‌రావు ఇంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అల్పాహారం చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ శుక్రవారం రాత్రి కోటగిరి మండలం జల్లాపల్లిలో బసచేసి శనివారం ఉదయం కొడిచర్ల చేరుకున్నారు. అక్కడ   గ్రామంలోని మహిళలతో కాసేపు ముచ్చటించారు. కార్యకర్త ఇంట్లో టిఫిన్​చేసిన అనంతరం కామారెడ్డి వెళ్లారు. ఆమె వెంట బాన్సువాడ నియోజకర్గ బీజేపీ ఇన్​చార్జి మాల్యాద్రి రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్,  బీజేపీ జనరల్ సెక్రటరీ ఏముల నవీన్, హన్మాండ్లు  పాల్గొన్నారు.