సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి

సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి
  • సభ సక్కగా నడుపుకుందం
  • ఆల్‌‌పార్టీ మీటింగ్‌‌లో ప్రతిపక్షాలకు మంత్రి ప్రహ్లాద్‌‌ జోషి విజ్ఞప్తి

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌ వర్షాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం పార్లమెంటరీ అఫైర్స్‌‌ మినిస్టర్‌‌‌‌ ప్రహ్లాద్‌‌ జోషి అధ్యక్షతన ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌ జరిగింది. ఈ సందర్భంగా సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని సభ్యులను ఆయన కోరారు. జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా, సమావేశాలకు ముందు నిర్వహించిన కీలక ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాకపోవడంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

అయితే, గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌‌ సింగ్‌‌ కూడా చాలాసార్లు ఇలాంటి మీటింగ్‌‌కు హాజరుకాలేదని బీజేపీ గుర్తుచేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ సింగపూర్‌‌‌‌ పర్యటన క్లియరెన్స్‌‌లో జాప్యం, అగ్నిపథ్‌‌, ఇన్‌‌ఫ్లేషన్‌‌, నిరుద్యోగం, ఫెడరల్‌‌ స్ట్రక్చర్‌‌‌‌ తదితర సమమస్యల గురించి సభలో చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయి. ఈ మీటింగ్‌‌ బీజేపీ తరఫున రాజ్‌‌నాథ్‌‌ సింగ్‌‌, పియూష్‌‌ గోయల్, ప్లహాద్‌‌ జోషి, అర్జున్‌‌ మేహ్‌‌వాల్‌‌, మురళీధరన్‌‌ హాజరుకాగా, కాంగ్రెస్‌‌ నుంచి మల్లికార్జున ఖర్గే, అధిర్‌‌‌‌ రంజన్‌‌ చౌధరీ, జైరాం రమేశ్‌‌, ఎన్సీపీ నుంచి శరద్‌‌ పవార్‌‌‌‌, సుప్రియ సూలే, జేడీయూ నుంచి రామ్‌‌నాథ్‌‌ ఠాకూర్‌‌‌‌, ఆప్‌‌ నుంచి సంజయ్‌‌ సింగ్‌‌, అకాళీదల్‌‌ నుంచి హర్​సిమ్రత్‌‌ కౌర్‌‌‌‌ హాజరయ్యారు.

19న మరోసారి మీటింగ్‌‌

శ్రీలంక సంక్షోభంపై చర్చించేందుకు జులై 19న మరోసారి ఆల్‌‌పార్టీ మీటింగ్‌‌ నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీని గురించి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌‌, జైశంకర్‌‌‌‌, జోషి మాట్లాడతారని తెలిపింది. ఆల్‌‌పార్టీ మీటింగ్‌‌లో శ్రీలంక సంక్షోభం, ఆ దేశంలో ఇబ్బంది పడుతున్న తమిళుల గురించి చర్చించాలని డీఎంకే, అన్నాడీఎంకే కోరాయి. దీంతో 19న మళ్లీ భేటీ కావాలని కేంద్రం నిర్ణయించింది.