
న్యూడిల్లీ: యూఎస్‌కు చెందిన స్మార్ట్ డివైజ్‌ల తయారీ సంస్థ ఆపిల్అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లలో చాలా వరకు మనదేశంలోనే తయారు చేయాలని నిర్ణయించిందని కేంద్రం టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన భారత్ టెలికం కార్యక్రమంలో మాట్లాడుతూ మున్ముందు మొత్తం ఐఫోన్ల తయారీ మనదేశంలోనే జరిగే అవకాశం ఉందన్నారు. పీఎల్ఐ వంటి స్కీముల వల్ల టెలికం పరికరాల మార్కెట్లు భారీగా వృద్ధి సాధిస్తున్నాయని అన్నారు.
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కంపెనీ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ జూన్ క్వార్టర్లో అమెరికాలో విక్రయించబోయే ఐఫోన్‌లలో ఎక్కువ భాగాన్ని భారతదేశం నుంచి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా టెలికమ్యూనికేషన్ల సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని మాట్లాడుతూ 2014లో మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా దిగుమతి చేసుకున్న భారతదేశం, ఇప్పుడు మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉత్పత్తి చేసే, ఎగుమతి చేసే దేశంగా మారిందని అన్నారు. గత ఏడాది మొత్తం 33 కోట్ల మొబైల్ ఫోన్‌ల ఉత్పత్తి జరిగిందని, ఐదు కోట్ల యూనిట్లను ఎగుమతి చేశామని వెల్లడించారు.