
రంగారెడ్డి: దేశంలోని పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. రాజేంద్రనగర్ లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2.3 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన మోడల్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంట్లో సోలార్ విద్యుత్ ను వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా ఆదేశాలిస్తామన్నారు. 1.5 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తే అందులో 75 వేల రూపాయలను లోన్ సబ్సిడీ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపాల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.