
- కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హామీ
- రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని ఫైర్
- పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో కిషన్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పత్తి రైతులకు అండగా ఉంటామని, ఎంత పండిస్తే అంత కొనుగోలు చేస్తామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. పత్తి చివరి కిలో వరకూ సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, రైతుల విషయంలో కాంగ్రెస్ సర్కారు క్రూరంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదని, రాష్ట్ర రైతులకు మద్దతుగా నిలించేందుకు ముందుకు రావాలని సూచించారు.
మంగళవారం ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర నేతలు గిరిరాజ్ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి గిరిరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి నిధులను రైతుల ప్రయోజనాల కోసం వినియోగించాలన్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. ‘‘పత్తిలో తేమ శాతాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ స్థాయిలో ఒక వేదికను ఏర్పాటు చేయాలి. తేమ శాతం తగ్గింపుపై రైతులకు అవగాహన కల్పించాలి. పత్తిని ఆరబెట్టేందుకు ఉపాధి హామీ పథకం నిధులను వాడుకోవాలి. ఆ తర్వాతే పత్తి కొనుగోలు కేంద్రాలకు పంపాలి. కానీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది” అని గిరిరాజ్ అన్నారు.
తొందరపడి పత్తిని తక్కువకు అమ్మొద్దు: కిషన్‌రెడ్డి
రైతులు తొందరపడి పత్తిని తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్మవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. తేమ శాతం ఎక్కువుందన్న పేరుతో ప్రైవేట్ వ్యక్తులు ధర తగ్గించి కోనుగోలు చేయండం వల్ల రైతులకే నష్టం వస్తుందన్నారు. 122 సెంటర్లలోని రైతు కమిటీల అభ్యర్థులు, అధికారులకు రైతులు తమ సమస్యలను చెబితే వారు వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. తేమ శాతాన్ని కచ్చితత్వంతో కొలిచే ఆధునిక మెషీన్లను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.