డూప్లికేట్ మాస్కులు అమ్ముతారా?.. చైనా కంపెనీపై యూఎస్ కేసు

డూప్లికేట్ మాస్కులు అమ్ముతారా?.. చైనా కంపెనీపై యూఎస్ కేసు

వాషింగ్టన్: సరైన క్వాలిటీ లేని అర మిలియన్ ఫేక్ ఎన్‌ 95 మాస్కులను అమెరికా బయ్యర్స్‌కు అమ్మినందుకు ఓ చైనా కంపెనీపై యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ కేసు పెట్టింది. బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో ఈ కంప్లయింట్‌ ను దాఖలు చేసింది. యూఎస్ బయ్యర్స్‌తో డీల్ ప్రకారం మెడికల్ సిబ్బందితోపాటు ఇతర ఎంప్లాయీస్‌కు అవసరమైన ఎన్‌ 95 మాస్కులను గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన కింగ్ ఇయర్ ప్యాకేజింగ్ అండ్ ప్రింటింగ్ అమెరికాకు పంపించింది. అయితే మాస్కులు క్వాలిటీ లేనివని తాజాగా యూఎస్ కేసు పెట్టింది. కాగా, తాము పంపిన 4,95,200 ఎన్ 95 మాస్కులు స్టాండర్డ్స్‌కు తగ్గట్లుగా ఉన్నాయని ఫిర్యాదులో సదరు కంపెనీ పేర్కొనడం గమనార్హం. అలాగే ఆయా మాస్కులను యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ (ఎన్‌ఐవోఎస్‌హెచ్) కూడా ధృవీకరించిందని కూడా తెలిపింది. మాస్కులు దిగుమతి చేసినందుకు సదరు కంపెనీకి 1 మిలియన్ డాలర్స్‌ కంటే ఎక్కువ మొత్తమే చెల్లించినట్లు ఫిర్యాదు ద్వారా తెలిసింది.

‘ఈ కంప్లయింట్‌లోని ఆరోపణలు అమెరికన్ సిటిజన్స్‌ సేఫ్టీపై నిర్లక్షతను ఎత్తి చూపుతున్నాయి’ అని మాస్క్స్ డీల్‌పై ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎఫ్‌బీఐ ఏజెంట్ డగ్లస్ కోర్నెస్కీ ఓ ప్రకటనలో తెలిపారు. నాణ్యత లేని హెల్త్ ప్రొడక్ట్స్‌ను పంపడంతోపాటు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు సదరు చైనా కంపెనీపై అమెరికా నాలుగు ఆరోపణలు మోపింది. ప్రతి ఆరోపణ కింద గరిష్టంగా 5 లక్షల డాలర్ల జరిమానా లేదా మాస్క్స్‌ అమ్మడంతో సదరు కంపెనీ సంపాదించిన దాని కంటే రెండింతలు ఎక్కువ మొత్తం తమకు చెల్లించాలని పేర్కొంది.