ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకం కావాలి

 ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకం కావాలి

హైదరాబాద్:  ప్రజల మధ్య విభజన సృష్టించే కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జేడీఎస్ పార్టీ అధినేత, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయిన సందర్భంగా కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయాలపై చర్చించారు. వచ్చే డిసెంబర్ లో కర్నాటకలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికర అంశంగా మారింది. 

ఎట్టి పరిస్థితుల్లో దేశంలో విద్వేషాలు చెలరేగకుండా కాపాడుకుంటామని సీఎం కేసీఆర్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజాస్వామిక సమాఖ్య స్పూర్తిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరమున్నదని తాము గుర్తించామని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కేసీఆర్ తో అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి గుణాత్మక ప్రగతికోసం తన వంతు సహకారాన్ని అందించాలని, దీనికోసం రాజకీయ పార్టీని స్థాపిస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమార స్వామి వెల్లడించారు. 

బీజేపీకి ప్రత్యామ్నయంగా కాంగ్రెస్ విఫలం..
దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని, కాంగ్రెస్ నాయకత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని,  ఈ నేపథ్యంలో  ప్రాంతీయ పార్టీల ఐక్యత తక్షణావసరమని వారు చర్చించారు. తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ వత్తిడి పెరుగుతోందని సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి తెలిపారు. మతతత్వ బీజేపీపై, మోడీ నిరంకుశ వైఖరిపై పోరాడాలని తన జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రతిచోటా బహిరంగసభలో ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారని కేసీఆర్ వివరించారు. తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ అనేకరకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్న బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారని, చివరకు తమ సొంత టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గ్రామస్థాయి నుంచీ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష, కార్యదర్శివర్గాలు కూడా జాతీయ పార్టీని స్థాపించి, బీజేపీని ఇంటికి సాగనంపాలని ముక్తకంఠంతో తీర్మానాలు చేస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. 

దేశంలో రైతు రాజ్యం రావాలె
వ్యవసాయాధారిత భారతదేశంలో తెలంగాణలో మాదిరిగానే రైతులకు ఇస్తున్న నిరంతర విద్యుత్ తదితర ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, రైతు రుణాల మాఫీ,   సహా  వ్యవసాయ అభివృద్ధి పథకాలన్నింటినీ దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని సీఎం కేసీఆర్ వివరించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్రపాలకుల నిర్లక్ష్యాన్ని ఈ ఇద్దరు నేతలు చర్చించారు. ముఖ్యంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తూ, దేశీయ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు.

తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్న దేశవ్యాప్తంగా ఉన్న పలు రైతు సంఘాల నేతలు ఇటీవలే రాష్ట్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పర్యటించారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీరు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల గురించి వారు తెలుసుకొని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని, తమకూ తెలంగాణ మాదిరిగానే 24 గంటలు ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందేలా చర్యలు చేపట్టాలని, అవసరమైతే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి రైతు రాజ్య స్థాపనకు కృషి చేయాలని డిమాండ్ చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. 

కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండాపై చర్చ

త్వరలో సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ఎజెండాపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. బీజేపీ రాజకీయ ఎత్తుగడలను తుత్తునియలు చేయని పక్షంలో దేశంలో రాజకీయ, పాలనా సంక్షోభం తప్పదని వారు తమ చర్చలో గుర్తించారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుపుతూ కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మౌలిక సమస్యలను గాలికొదిలి, భావోద్వేగాలతో పబ్బం గడుపుకొనే బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని, అందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలను వేదికగా మలచుకోవాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. 

కేసీఆర్ కేంద్రంగా దేశ రాజకీయాల్లో చర్చ

మూస రాజకీయాలతో దేశ వ్యాప్తంగా  ప్రజలు విసుగెత్తిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, అయితే సరిపడే మంచి పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ గురించి కేసీఆర్, కుమారస్వామి చర్చించారు. అంతర్జాతీయంగా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలు చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. జాతీయ సమస్యలపై ఢిల్లీ కేంద్రంగా జరిపిన చర్చలతోపాటు, తాను చేపట్టిన పలు రాష్ట్రాల పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రజలు పలికిన ఆహ్వానాల తీరుతెన్నులపై వారిద్దరూ చర్చించారు.

తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు సాగిన అభిప్రాయ సేకరణ మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగామని త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సుమారు 3 గంటలకు పైగా సాగిన సమావేశంలోని చర్చలు అర్థవంతంగా ముగిసాయని సీఎంఓ ప్రకటించింది. సమావేశం అనంతరం ప్రగతి భవన్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి సీఎం కేసీఆర్ మర్యాద పూర్వకంగా వీడ్కోలు పలికారు.