సర్కారుకు సంకల్పముంటే.. ఆరోగ్య తెలంగాణ సాధ్యమే!

సర్కారుకు సంకల్పముంటే.. ఆరోగ్య తెలంగాణ సాధ్యమే!

ప్రజల ఆరోగ్యానికి అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న విధానం, సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ. అంటే దేశంలోని ప్రజలందరికీ సమాన స్థాయిలో ఆరోగ్యం అందించడం. కానీ మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో అమలు కావడం లేదు. తెలంగాణలో ప్రజలు తమ ఆరోగ్యం కాపాడుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఆర్థికంగా దిగజారి పోతున్నారు. మధ్య తరగతి వారు పేదరికంలోకి, పేదలు మరింత నిరుపేదలుగా మారుతు న్నారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. తాగుడుకు బానిసై యువకులు యుక్త వయసులో చనిపోతే వారి భార్యలు చిన్న వయసులోనే వితంతువులవుతున్న దుస్థితి నెలకొంది. 

రాష్ట్రంలో ఏటా కొన్ని వేల మంది రోగ నిర్ధారణ కాక ముందే చనిపోతున్నారు. పేదలు ఏ చిన్న జబ్బు వచ్చినా మొదట వెళ్లేది ఆర్ఎంపీల దగ్గరికే. కొంచెం పెద్ద జబ్బులు వస్తే 50 శాతంపైనే రోగులు హైదరాబాదు బాట పడతారు. ఇందులో కూడా 90 శాతం రోగులు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళతారు. మిగతా వారు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాదు లాంటి పెద్ద పట్టణాల్లో ఉన్న ప్రైవేటు స్పెషలైజ్డ్ వైద్యుల దగ్గరకు వెళ్తారు. ప్రభుత్వం సుమారుగా 1000 కోట్ల రూపాయలు కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నది. ఎప్పటి నుంచో ఉన్న ఓ ప్రతిపాదనేమిటంటే.. ఆరోగ్యశ్రీకి చెల్లించే డబ్బుతో ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించవచ్చు కదా అని. ప్రస్తుత ప్రైవేటు ఆస్పత్రుల్లో మూడు అంచెల రేట్లు నడుస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు, మధ్యస్థాయి ప్రైవేట్ ఆస్పత్రులు, సామాన్య ప్రైవేటు ఆస్పత్రులు.

ఒక సామాన్య ఆస్పత్రిలో ఎంఎస్ చేసిన సర్జన్ ఒక ఆపరేషన్ చేస్తే ఒక లక్ష రూపాయలు చార్జ్ చేస్తే అదే ఆపరేషన్ మధ్య స్థాయి హాస్పిటల్ లో చేసినప్పుడు రెండు లక్షలు, కార్పొరేట్ ఆస్పత్రిలో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు చార్జి చేస్తున్నాడు. అదే ఆపరేషన్ ను ప్రభుత్వ పెద్దాస్పత్రిలో కూడా పేషెంట్​కు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయవచ్చు. కానీ ఒక పేద పేషెంట్​కు కూడా ప్రభుత్వ ఆస్పత్రి మీద నమ్మకం లేదు. ఇపుడు ఆ పేద పేషెంట్ లేదా మిడిల్ క్లాస్ పేషెంట్ ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం మంచి ఆస్పత్రులు నిర్మించకుండా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించకపోవడం వల్ల ప్రజల నిస్సహాయత పరిస్థితిని ఆసరా చేసుకొని ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు, రాష్ట్రంలోనేగాక జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో వైద్యాన్ని వ్యాపారంగా మార్చాయి. మొత్తానికి రాష్ట్రంలో ఆరోగ్య సమస్య వచ్చిందంటే ప్రజలు గడగడ వణికిపోవాల్సిందే.

మండల స్థాయిలో..

ఇదే పద్ధతిలో మండల స్థాయిలో ఉన్న పీహెచ్​సీలను బలోపేతం చేయాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం ముగ్గురు డాక్టర్లు ఉండాలి. పగలు ఇద్దరు(ఒక ఆడ, ఒక మగ డాక్టరు) రాత్రి ఒక డాక్టరు ఉండాలి. ముగ్గురు నర్సులు, తగినంత ఇతర వైద్య సిబ్బంది ఉండాలి. ఒక నర్సు నైట్ డ్యూటీలో ఉండాలి. గ్రామీణ  ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక కేంద్రాలకు అనుబంధంగా రెండు వైద్యుల నివాస భవనాలు రెండు నర్సుల నివాస భవనాలు కట్టాలి. దీని వల్ల 24 గంటలు వైద్యుల, నర్సుల సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రతి డాక్టరుకు 1/3 వంతు గ్రామాలను 1/3 వంతు రోగనిర్ధారక కేంద్రాలు / ఆరోగ్య ఉపకేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఇవ్వాలి. సీనియర్ డాక్టర్​కు పీహెచ్​సీ పూర్తి బాధ్యత అప్పగించాలి. మండలంలో పనిచేస్తున్న ఏ ఎన్ఎంలు, ల్యాబ్ ​టెక్నీషియన్లు, నర్సులు, మలేరియా సిబ్బంది, 108 సిబ్బంది, ఇతర సిబ్బంది అందరినీ పీహెచ్ సీ నియంత్రణలోకి తీసుకురావాలి.

 ప్రతి డాక్టరుకు ఇంటర్నెట్ సౌకర్యంతో ఉన్న ఒక కంప్యూటర్​ను కేటాయించాలి. ప్రతి రోగి ఓపీ సమాచారం కంప్యూటర్లో నమోదు చేయాలి. ప్రతి పీహెచ్ సీ, వారి నియోజకవర్గ 200 పడకల ఆస్పత్రి అనుసంధానంతో పనిచేయాలి. ప్రతి పీహెచ్​సీలో రక్త నిలువ కేంద్రం ఉండాలి.  పాము కాటుకు, తేలు కాటుకు, కుక్క కాటుకు, గుండె పోటుకు సంబంధించి అత్యవసర ప్రాణం కాపాడే మందులను అందుబాటులో ఉంచాలి. కావాల్సిన బడ్జెట్​ను కేటాయించి.. 108 అంబులెన్స్​సేవలను మెరుగుపరచాలి.

సాఫ్ట్​వేర్​ వ్యవస్థ కీలకం

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అపోలో ఆస్పత్రి లాంటి ఒక 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలి. గ్రామ స్థాయిలో రోగ నిర్ధారక పరీక్ష కేంద్రం నుంచి మెడికల్ కాలేజీ అనుబంధ పెద్ద ఆస్పత్రి వరకు ప్రతి రోగి వివరాలు సాఫ్ట్​వేర్ ద్వారా కంప్యూటర్​లో నమోదు చేయాలి. దీనికి ఒక సమగ్ర సాఫ్ట్​వేర్​ తయారు చేయాలి. ప్రభుత్వం వైపు నుంచి 50 మంది ఐటీ నిపుణులతో(33 జిల్లాలకు 33, హైదరాబాదులో 17 మందితో) ఒక మెడికల్ & హెల్త్ ఐటీ సెంటర్​ను నడపాలి. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న టెలి మెడిసన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలి. దీనివల్ల మారుమూల ప్రాంతాల ప్రజలకు చాలా మేలు జరిగే అవకాశం ఉంది. వైద్య శాఖకు సంబంధించి సమగ్ర సాఫ్ట్​వేర్ పెట్టడం ద్వారా వైద్యుల, ఇతర సిబ్బంది హాజరు, మందులు, వైద్య పరికరాలు, అంబులెన్సులు, అధికారులు సందర్శనలు, రోగాలు, కాన్పుల పరిస్థతి, ఆస్పత్రుల పనితీరు, వాటి ర్యాంకింగ్​లు, బడ్జెట్ ఖర్చులు అన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. 

వాటిని విశ్లేషించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ సమాచారాన్ని పబ్లిక్​డొమైన్​లో పెట్టాలి. డబ్ల్యూహెచ్​వో ప్రమాణాల ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకు మూడు బెడ్లు(ఆస్పత్రుల్లో) ఉండాలి. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుమారుగా 21,000 బెడ్లు ఉన్నాయి. మన జనాభా ప్రకారం మొత్తం1,10,000 బెడ్లు ఉండాలి. నియోజకవర్గ స్థాయిలో ఒక 200 పడకల ఆస్పత్రి, 26 మెడికల్ కాలేజీల్లో కనీసం 300 పడకలు చేయగలిగితే ప్రభుత్వ రంగంలో ఇంకో13,000 పడకలు పెరుగుతాయి. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టరు నెలలో కనీసం ఒకసారైనా ప్రతి పీహెచ్​సీ, నెలలో కనీసం రెండుసార్లు ప్రతి సీహెచ్​సీ, 200 పడకల ఆస్పత్రులను తనిఖీ చేసేటట్లుగా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ ప్రతి నెల ఒకసారి మధ్యాహ్నం ఆస్పత్రుల్లో రివ్యూ మీటింగులు పెట్టాలి.

ఎస్​డీఎఫ్ ​సూచనలు

ప్రభుత్వ డాక్టర్లు వాళ్లకు సొంత ప్రైవేట్ ప్రాక్టీస్​లు ఉండటం వల్ల నిబద్ధతతో పనిచేసే పరిస్థితులు లేకపోవడం పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకపోవడానికి ఒక కారణం. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీలు ఏర్పడితే నియామకాలు చేపట్టకపోవడం మరో కారణం. డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరు కాకపోవడం, పేదరోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి, తగినంత మంది వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది లేకపోవడం, స్వీపర్ మొదలుకొని సూపరింటెండెంట్ వరకు రోగుల నుంచి డబ్బులు తీసుకోవడం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, ఆస్పత్రులకు సప్లయ్ అవుతున్న మందులు ఇతర వస్తువులను అమ్ముకోవడం, ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలకు రోగులను పంపి కమీషన్లు తీసుకోవడం, డ్యూటీ టైమ్​లలో ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేయడం తదితర కారణాల వల్ల తెలంగాణలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదు.

 తెలంగాణలో ఆరోగ్య సేవలు మెరుగు పరచడానికి సోషల్ ​డెమొక్రాటిక్​ ఫోరమ్​కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నది. ప్రతి 5000 జనాభాకు ఒక డయాగ్నిస్టిక్​ కేంద్రం, ప్రతి 5000 మందికి ఒక ఆరోగ్య ఉపకేంద్రం, రోగ నిర్ధారక కేంద్రం కలిపి ఒక గ్రామ లేదా బస్తీ స్థాయి ఆరోగ్య కేంద్రం నడిపించాలి. దీనికి ఒక 2600 చదరపు అడుగుల భవనం అవసరం. ప్రతి గ్రామ/బస్తీ ఆరోగ్య కేంద్రంలో ఒక ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్ ఒక లాబ్ టెక్నీషియన్ ఉండాలి. ఈ కేంద్రంలో పూర్తిస్థాయి ఫర్నిచర్, పరికరాలు ఉండాలి. కంప్యూటర్ సాఫ్ట్​వేర్ ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తి రోగనిర్ధారక పరీక్షల సమాచారం నమోదు చేయాలి. దాన్ని ఆధారకార్డు సంఖ్యతో అనుసంధానించాలి. ఈ పరీక్షల ఫలితాలు రాష్ట్రంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా అక్కడ డౌన్లోడ్ చేసుకునేలా రూపొందించాలి. 

ప్రైవేటు ప్రాక్టీసు చేయనీయకూడదు

రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య శాఖకు ఆరోగ్యశాఖ చీఫ్​ కమిషనర్​గా ఒక సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ హెచ్ఐడీగా ఉండాలి. సీసీహెచ్​ కింద ఇతర ఆస్పత్రులకు డైరెక్టర్లను నియమించాలి. వైద్యశాఖలో జరిగే ప్రతి పరికరం కొనుగోలుకు నిపుణుల కమిటీ వేయాలి. అన్ని పీహెచ్​సీలకు, 200 పడకల ఆస్పత్రులకు, మెడికల్ కాలేజీలకు, అనుబంధ ఆసుపత్రులకు పనితీరు ర్యాంకింగ్​ ఇవ్వాలి. రోగుల నుంచి, వారి బంధువుల నుంచి ఎప్పటికప్పుడు థర్డ్​పార్టీ ద్వారా ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు, వారి సేవలకు సంబంధించి, ఆస్పత్రిలో జరిగే అవినీతి గురించి, ఆస్పత్రి మరుగుదొడ్లు, ఆవరణ పరిశుభ్రతకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ప్రతి ఆస్పత్రిలో కావాల్సిన సెక్యూరిటీ, హౌస్​కీపింగ్​సిబ్బందిని ఏర్పాటు చేసి వారిని పర్యవేక్షించడానికి ఒక అధికారిని, పెద్ద ఆస్పత్రు లకు ఒక ఎస్టేట్ ఆఫీసర్​ను పెట్టాలి. ప్రభుత్వ డాక్టర్ల, ప్రభుత్వ ఆస్పత్రుల సేవలు ప్రజలకు పూర్తిగా నాణ్యతతో అందాలంటే ప్రభుత్వ డాక్టర్లను ప్రైవేటు ప్రాక్టీసు చేయనీయకూడదు. 

ప్రతి డాక్టరు జీత భత్యాలు కార్పొరేట్​లలో ఎంత ఉంటాయో అంత కంటే ఒక పది శాతం ఎక్కువే ఉండాలి. భవి ష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడి కల్ కాలేజీలను, ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవే టు పరం చేయకూడదు. ప్రపంచంలో చాలా దేశా ల్లో వైద్య ఆరోగ్య సేవలు ప్రభుత్వ రంగం లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన ఆరో గ్య సేవలు పూర్తిగా ఉచితంగా అందించాలనే సంకల్పం ఉంటే ఇది చేయ గలిగే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని చెప్ప డానికి సోషల్ డెమొక్రటిక్ ఫోరం లెక్క లను ప్రజల ముందు పెట్టి ప్రజల తరఫున అన్ని రాజకీయ పార్టీలను కలిసి వారి ఎలక్షన్ మ్యానిఫెస్టోలో పెట్టాలని, ఈ విషయాలు ప్రతి పబ్లిక్ మీటింగులలో చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

‘‘బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్న విషయాన్ని కూడా బీజేపీ రెచ్చగొట్టి పెద్దది చేస్తోంది. బయటి నుంచి గూండాలను నియమించి కూడా గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్​ చేస్తారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  ఏదైనా జరిగినప్పుడు వాళ్లు సైలెంట్​గా ఉంటారు’’
-  మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్​ సీఎం

‘‘మణిపూర్,  హర్యానా పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. సుప్రీంపైనే మా ఆశలు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా లేదా పార్టీ ఎజెండా ప్రకారం నడుస్తుందో కోర్టు చూడాలి. సుప్రీంకోర్టు మాత్రమే ఇప్పుడు రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించగలదు’’
-   మెహబూబా ముఫ్తీ, పీడీపీ చీఫ్

‘‘హర్యానాలో అల్లర్లు, హింస చెలరేగడం, ప్రజల ఆస్తులు, మతపరమైన స్థలాల విధ్వంసం.. ఇలా మణిపూర్ లాగే హర్యానాలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పనిచేయకపోవడం ఆందోళనకరం’’
-  మాయావతి, బీఎస్పీ చీఫ్- సోషల్ డెమొక్రటిక్ ఫోరమ్, హైదరాబాద్