ఒకటా.. రెండా.. సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత ఎన్నెన్ని దారుణాలు చేసిందో చూడండి..!

ఒకటా.. రెండా.. సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత ఎన్నెన్ని దారుణాలు చేసిందో చూడండి..!

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్ట్లో కీలక అంశాలను డాక్టర్ నమ్రత బయటపెట్టడం గమనార్హం. తన కొడుకు జయంత్ కృష్ణ న్యాయవాది కావడంతో అతని సహకారం కూడా తీసుకుని ఈ దందా మొదలుపెట్టినట్లు నమ్రత తెలిపింది. 1998లో విజయవాడలో, 2007లో సికింద్రాబాద్లో ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించారు. విశాఖపట్నంలో కూడా ఆసుపత్రి ప్రారంభించి పిల్లలు లేని దంపతుల నుంచి 20 నుంచి 30 లక్షలు వసూలు చేసినట్లు నమ్రత అంగీకరించింది. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరుతో దంపతులను నమ్రత మోసం చేసింది.

సంజయ్ అతని భార్య ద్వారా పిల్లలకు వల వేసి కొనుగోలు చేసినట్లు తెలిపింది. అబార్షన్ చేయించుకోవడానికి వచ్చే కొందరు గర్భిణులకు డబ్బుల ఆశ చూపి, ప్రసవం తర్వాత పిల్లల్ని కొనుగోలు చేసే దందాకు డాక్టర్ నమ్రత తెరలేపింది. పిల్లలు సరోగసితో పుట్టారని బాధిత దంపతులకు అప్పగించేది. ఏపీలోని విశాఖపట్నం మహారాణిపేటలో 4 కేసులు, విశాఖ టూ టౌన్లో రెండు కేసులు, గుంటూరు కొత్తపేటలో ఒక కేసు, తెలంగాణలోని గోపాలపురంలో 5 కేసులు నమ్రతపై నమోదయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందితో కలిసి సరోగసి దందా చేసినట్లు విచారణలో వెల్లడైంది. పిల్లల కొనుగోలుపై ఇప్పటికే డాక్టర్ నమ్రత నేరం ఒప్పుకుంది. దాదాపు 80 ఫేక్ సరోగసీలు చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించింది. 

సంతానం లేని దంపతులు ఐవీఎఫ్ కోసం దవాఖానకు వస్తే వారిని డాక్టర్ నమ్రత సరోగసి వైపు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయాన్ని డాక్టర్ నమృత ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఐవీఎఫ్కు రూ. ఒకటి.. రెండు లక్షలు మాత్రమే వస్తాయని.. అదే సరోగసీ అయితే రూ. 30 నుంచి రూ.40 లక్షలు వస్తాయనే దుర్బుద్ధితో నమ్రత ఈ దారుణాలకు ఒడిగట్టారు.

చాలా కేసుల్లో సరోగసీ చేయకుండానే పేద, మధ్య తరగతి దంపతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకొని వారికి ఎంతో కొంత చెల్లించి వాళ్ల పిల్లలను సంతానం లేని దంపతులకు సరోగసీ పేరుతో అంటగట్టినట్లు సమాచారం. సరోగసీ చేయకుండానే చేసినట్లుగా నమ్మించి మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత ఒప్పుకుంది. ఇలా రూ. కోట్లు సంపాదించింది. ఈ ప్రక్రియలో డాక్టర్ నమ్రతకు గాంధీ దవాఖాన అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సదానందం సహకరించాడు.