
లక్నో : ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మరోసారి నిరాశ పరిచాడు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ఉన్నతి హుడా, ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో మాజీ వరల్డ్ నం.1 శ్రీకాంత్ 21–23, 8–21తో కొరియా షట్లర్ చియా హవో లీ చేతిలో వరుస గేమ్స్‌లో ఓడిపోయాడు.
ఇతర మ్యాచ్‌ల్లో ప్రియాన్షు 21–17, 21–19తో దిమిత్రి పరనిన్ (కజకిస్తాన్)పై, కిరణ్ జార్జ్ 21–16, 14–21, 21–13తో చిరాగ్ సేన్‌పై విజయం సాధించారు. సమీర్ వర్మ 9–21, 21–17, 17–21తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. విమెన్స్ సింగిల్స్‌లో 16 ఏండ్ల ఉన్నతి 15–21, 21–19, 21–18తో ఇండియాకే చెందిన ఆకర్శి కశ్యప్‌కు షాకిచ్చింది. అనుపమ, అష్మిత కూడా రెండో రౌండ్‌లో అడుగు పెట్టారు.