అకాల వర్షం.. అపార నష్టం

అకాల వర్షం.. అపార నష్టం
  •     అన్నిచోట్ల మొదలుకాని ధాన్యం కొనుగోళ్లు
  •     వడ్లు తడుస్తున్నాయని రైతుల ఆందోళన
  •     టార్ఫాలిన్లు ఇవ్వని ఆఫీసర్లు
  •     కాంటా కోసం పడిగాపులు

మెదక్​, సంగారెడ్డి, వెలుగు: యాసంగి వరి కోతలు ఇటీవల ప్రారంభమయ్యాయి. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి, శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం కలగడంతో పాటు చాలాచోట్ల కోతకు వచ్చిన వరి పంట దెబ్బతింది. కొనుగోలు కేంద్రాల వద్ద, రోడ్ల మీద ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.  

మెదక్ జిల్లాలో యాసంగి సీజన్​లో 2.16 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేయగా అధికారులు 4.20 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 3.66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని జిల్లా వ్యాప్తంగా 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 108, పీఏసీఎస్​, మార్కెటింగ్​, డీసీఎంఎస్​ ఆధ్వర్యంలో 302 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ అన్నిచోట్ల ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. 

మెదక్ పట్టణ పరిధి పిల్లికొటాల్, మండల కేంద్రమైన కొల్చారం, నాయిని జలాల్ పూర్, అప్పాజిపల్లి తదితర చోట్ల రైతులు వరికోసి  ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తరలించినప్పటికీ వడ్ల కాంటాలు ప్రారంభించలేదు. కౌడిపల్లి మండల పరిధిలోని ముట్రాజ్​పల్లి, నాగ్సానిపల్లి తదితర గ్రామాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి చాలా రోజులవుతున్నా గన్నీబ్యాగులు రాలేదని ఇంకా తూకం వేయడం లేదు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. శనివారం ఉదయం నుంచి చిరు జల్లులు కురుస్తుండడంతో వడ్లు తడవకుండా ఉండేందుకు రైతులు టాపర్లు కిరాయికి తెచ్చి కప్పుతున్నారు. సీఎం రైతులకు టార్ఫాలిన్లు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఎక్కడా ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, కంగ్టి, మనూర్, కల్హేర్, సిర్గాపూర్, నాగలిగిద్ద మండలాల్లో శుక్రవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో ఖేడ్ రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. కంగ్టి  మండలంలో అత్యధికంగా 64.5 మిల్లీమీటర్లు, మనూర్​లో 43.2, నాగల్​గిద్దలో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లో శనివారం చిరుజల్లులు కురిశాయి. 

జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలు కాగా అకాల వర్షాలు కురుస్తుండడంతో కోతకొచ్చిన వరి పంట దెబ్బతింటుందని, నూర్పిడి చేసి ఆరబోసిన వడ్లు తడిసిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.  జిల్లాలో ఈ సీజన్​లో అధికారులు 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 211 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్దమయ్యారు. వీటిలో ఐకేపీ కేంద్రాలు 101,  డీసీఎంఎస్​  కేంద్రాలు12, పీఏసీఎస్​ కేంద్రాలు 99 ఏర్పాటు చేశారు. కానీ ధాన్యం కొనుగోలు అంతటా మొదలు కాలేదు. 

12 రోజులుగా ఆరబెడుతున్నా 

 నేను కౌలుకు చేస్తున్న 4 ఎకరాల్లో ఎకరం వరికోసి వడ్లు సెంటర్​దగ్గరకు తెచ్చి12 రోజుల నుంచి ఆరబెడుతున్నా. ఇప్పటికీ ఇంకా కాంటా కాలేదు. వడ్లు ఆరబోసేందుకు, వాన పడితే కప్పేందుకు ఆఫీసర్లు టార్ఫాలిన్లు ఇవ్వలేదు. కిరాయికి తెచ్చుకున్న టార్ఫాలిన్లకు ఇప్పటికే రూ. 6 వేలు ఖర్చయింది. వడ్లు కాంటా పెట్టడానికి ఇంకా వారమవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు వర్షం ఎప్పుడొస్తుందో తెలియడం లేదు.  
- మహిపాల్, రైతు, నాగ్సానిపల్లి

ఎప్పుడు కొంటారో ఏమో

వడ్లు సెంటర్​కు తెచ్చి వారమవుతుంది. సీరియల్ నెంబర్​ కూడా రాసుకుంటలేరు. బార్దాన్​ రాలేదని కాంట పెడ్తలేరు. వడ్లు ఎప్పుడు కొంటరో ఏమో అర్థమైతలేదు. నిన్న రాత్రి పడ్డ వానకు ధాన్యం తడిసిపోయింది. పని మానేసి వడ్ల కుప్పల కాడ కావలి ఉంటున్నం.  ప్రభుత్వం వెంటనే వడ్లను కొనే విధంగా చర్యలు తీసుకోవాలి.
- తలారి లక్ష్మి, రైతు, ముట్రాజ్ పల్లి