
విజె సన్ని, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. రజిత్ రావు నిర్మిస్తున్నారు. జూన్ 9న సినిమా విడుదల. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కామెడీ అనేది ఒక స్వీట్ లాంటిది. అది ఎక్కువ పెట్టిన, తక్కువ పెట్టిన సమస్యే. అందుకే అలాంటివి తీయడానికి దర్శకులు వెనకాముందు ఆలోచిస్తుంటారు. అయితే రచయితగా నాకు పేరు తీసుకొచ్చింది కామెడీనే.
అందుకే ఇకపై దర్శకుడిగా ఏడాదికో కామెడీ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా. దాదాపు ఇండస్ట్రీలోని హాస్యనటులందరినీ పెట్టి రెండు గంటలపాటు నవ్వించాలని తీసిన సినిమా ఇది. సన్నీ తను పోషించిన మాస్ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశారు. అలాగే జిలానీ రాందాస్‌గా సప్తగిరి అద్భుతంగా నటించాడు. ఇక నా గత రెండు చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు.
ఆ టైమ్‌లో బాలకృష్ణ గారి ‘అన్ స్టాపబుల్ షో’లోని ‘చిత్తశుద్ధి లక్ష్యశుద్ధితో ఏ పని చేసిన ఆ పంచభూతాలు కూడా ఆపలేవు’ అనే మాట స్ఫూర్తినిచ్చింది. నన్ను నేను రీచెక్ చేసుకోవడానికి ఉపయోగపడింది. అందుకే ఈ మూవీకి ‘అన్ స్టాపబుల్’ పేరు పెట్టా. సినిమాను కూడా బాలకృష్ణ గారి పుట్టినరోజుకు ఒక రోజు ముందు విడుదల చేస్తున్నాం. టైటిల్ తరహాలోనే కథ, పాత్రలు కూడా అన్ స్టాపబుల్‌గా ఉంటాయి. అన్ లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ ఇస్తున్నాం’ అన్నాడు.