పర్యాటకులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ 

పర్యాటకులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ 

గోదావరిఖని, వెలుగు: భూగర్భంలో నిక్షిప్తమైన బొగ్గును వెలికితీయడం ఎలా అనేది ఇప్పటివరకు గని కార్మికులకు మాత్రమే తెలుసు. ఇక నుంచి సాధారణ ప్రజలకు కూడా వివరించేందుకు సింగరేణి సంస్థ సిద్ధమవుతున్నది.సింగరేణి సహకారంతో ఆర్టీసీ దేశంలోనే మొదటిసారిగా గని టూరిజం ప్యాకేజీని అమలు చేయబోతోంది. గోదావరిఖని ఆర్జీ 2 డివిజన్‌‌ పరిధిలో ఇటీవల మూసివేసిన జీడీకే 7 ఎల్‌ఈపీ(లైఫ్ ఎక్స్‌‌టెన్సన్‌‌ ప్రాజెక్ట్‌‌) గనిని ఇందుకోసం రెడీ చేస్తోంది. ఈ నెల 27న గనిని చూసేందుకు ఆర్టీసీకి చెందిన ముఖ్యమైన ఆఫీసర్లు వస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సింగరేణి సంస్థ డైరెక్టర్‌‌ ఎస్‌‌.చంద్రశేఖర్‌‌, జనరల్‌‌ మేనేజర్లు ఎ.మనోహర్‌‌, కె.నారాయణ, వైవి రావు, ఇతర ఆఫీసర్లు గనిని సందర్శించి సమీక్ష చేసి తగిన సూచనలు చేశారు. 

టూరిజం ప్యాకేజీ ద్వారా...

భూగర్భంలో 300 నుంచి 400 మీటర్ల లోతుల్లోకి కార్మికులు వెళ్లి బొగ్గును ఎలా తీస్తారనేది తెలుసుకోవడానికి వీలుగా ఆర్టీసీ సంస్థ ‘కోల్ టూరిజం’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీ తీసుకువస్తోంది. హైదరాబాద్‌‌ నుంచి ప్రతి రోజు ఒక ప్రత్యేక వెహికల్‌‌  ద్వారా పర్యాటకులను కోల్‌‌బెల్ట్ ప్రాంత పర్యటనకు తీసుకువస్తారు. గోదావరిఖనిలోని జీడీకే 7 ఎల్ఈపీ గనిలో మ్యాన్‌‌ రైడింగ్‌‌ ద్వారా పర్యాటకులను గని లోపలికి దింపి బొగ్గు వెలికితీసే విధానం, పైకి రవాణా, భూగర్భంలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఇతర వివరాలను తెలియజేస్తారు. అలాగే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కోసం వాడుతున్న మెషిన్లు, సంస్థ ప్రగతి, లాభనష్టాలు, పర్యావరణం కోసం చేస్తున్న కృషి, సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి తెలియజేసే హోర్డింగ్‌‌లను గని ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు భోజన వసతి కల్పించిన తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు ఏదైనా ఒక ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌లో బొగ్గు, మట్టి వెలికితీత కోసం చేపట్టే బ్లాస్టింగ్‌‌ను వ్యూ పాయింట్ నుంచి ప్రత్యక్షంగా చూపిస్తారు. 

విద్యుత్‌‌ ఉత్పత్తి గురించి..

గోదావరిఖని నుంచి పర్యాటకులను జైపూర్‌‌ మండల పరిధిలోని సింగరేణి విద్యుత్‌‌ కేంద్రానికి తీసుకెళతారు. 1200 మెగావాట్ల ప్లాంట్‌‌ను చూపిస్తారు. కరెంట్‌‌ ఉత్పత్తి విధానాన్ని వివరిస్తారు. అనంతరం పర్యాటకులను రాత్రివరకు హైదరాబాద్‌‌ తీసుకెళతారు. ఇందుకు ఆర్టీసీ సంస్థ ప్రతిపాదన చేయగా  సింగరేణి ఆఫీసర్లు అంగీకారం తెలిపారు. ఒకరికి ఎంత టిక్కెట్‌‌ అవుతుంది, ఇక్కడి పరిస్థితులేమిటి అనే విషయాలను 27న ఆర్టీసీ ఆఫీసర్లు పరిశీలించనున్నారు. 

ఎలా పనిచేస్తారో చెబుతాం

చాలామందికి భూగర్భంలో, ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌లలో బొగ్గు ఎలా వెలికితీస్తారనేది తెలియదు. దీనికోసం గోదావరిఖనిలో మూసివేసిన జీడీకే 7 ఎల్‌ఈపీ గనిని సిద్ధం చేస్తున్నాం. భూగర్భంలోకి మ్యాన్‌‌ రైడింగ్‌‌ ద్వారా పర్యాటకులను తీసుకెళ్లి బొగ్గు పొరలను, వాటిని బయటకు ఎలా తీస్తారు, కార్మికులు ఎలాంటి వాతావరణంలో పనిచేస్తారనే విషయాలను వివరిస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా గనిని తొలిసారిగా పర్యాటక కేంద్రంగా డెవలప్‌‌ చేసేందుకు సింగరేణి చర్యలు తీసుకుంటోంది. 

‒ ఎస్‌‌.చంద్రశేఖర్‌‌, సింగరేణి డైరెక్టర్‌‌