ట్యాంక్ బండ్ చెప్పని కథలు-2

ట్యాంక్ బండ్ చెప్పని కథలు-2

నల్లగొండ జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించిన సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి. 1909లో నల్లగొండ జిల్లా కొలనుపాకలో ఆరుట్ల రామచంద్రారెడ్డి పుట్టారు. కొలనుపాకలో బడి చదువు తర్వాత హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ ఉంటూ నాంపల్లి హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1930లో దండి సత్యాగ్రహ స్పూర్తితో హైదరాబాద్లో ఉద్యమించారు. ఆర్య సమాజం, కాంగ్రెస్ సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. 1931లో ఉస్మానియా యూనివర్శిటీలో చేరిన రామచంద్రారెడ్డి ఆంధ్ర మహాసభలో కీలకంగా వ్యవహరించారు. 

యువతకు స్ఫూర్తి
పెండ్లి చేసుకోకుండా ఉద్యమించాలనుకున్న రామచంద్రారెడ్డి కుటుంబం ఒత్తిడితో 1931లో మేనమామ బిడ్డ రుక్మిణిని పెళ్లిచేసుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ మహిళా నేత కమలాదేవి చటోపాధ్యాయ స్ఫూర్తితో భార్య పేరును కమలాదేవిగా మార్చారు. ఆమెను చదివించి సమాజంపై ఆవగాహన కల్పించారు. ఇద్దరూ కలిసి ఆంధ్రమహాసభ తరపున విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. దొరల దోపిడిపై రామచంద్రారెడ్డి ప్రసంగాల స్ఫూర్తితో ఎందరో యువతీయువకులు ఉద్యమంలోకి వచ్చారు. చదువు పూర్తయ్యాక కొలనుపాక వెళ్లిన రామచంద్రారెడ్డి అక్కడ రైతులు, కూలీలను చైతన్యపరిచారు.

తప్పుడు కేసుతో జైలు పాలు
1944లో భువనగిరిలో 11వ ఆంధ్రమహాసభ సమావేశాల్లో ఆరుట్ల కార్యదర్శిగా ఎంపికయ్యాడు. విసునూర్ దేశ్ ముఖ్ జాగీర్ గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్ని చైతన్య పరిచాడు. దొరల గుప్పిట్లో ఉన్న భూముల్ని పేదలకు పంచాడు. దీంతో దేశ్ ముఖ్ పథకం ప్రకారం 1945లో పాలకుర్తి కుట్ర కేసు పేరుతో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆరుట్లను చూస్తేనే జైలు అధికారులకు వణుకు పుట్టేది. అందుకే సెల్లో కూడా ఆయన కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి ఉంచేవారు. జైలులో ఉన్నా ఖైదీల హక్కుల కోసం ఆరుట్ల ఉద్యమించి వాటిని సాధించాడు. ఆయనపై పెట్టింది తప్పుడు కేసు అని భువనగిరి కోర్టు కొట్టివేయడంతో ఏడాది తర్వాత విడుదలయ్యారు. అప్పటికి భూస్వాముల అరాచకాలపై సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. సాయుధ పోరాటంలో ఆరుట్ల విరుచుకుపడ్డాడు. ఊరూరా గెరిల్లా దళాలను ఏర్పాటుచేసి విసునూర్ దేశ్ ముఖ్ గుండాలను ఎదుర్కున్నాడు. దీంతో 1946లో నల్లగొండ జిల్లాలో నిజాం సర్కార్ మార్షల్ లా పెట్టింది. ఆ సమయంలోనే పుట్టిన బిడ్డను బంధువుల దగ్గర వదిలి భార్యతో కలిసి ఆరుట్ల అండర్ గ్రౌండ్లోకి వెళ్లాడు. చుల్లూరు గుట్టల్లో ఆరుట్ల పోరాటాన్ని ఇప్పటికీ ఆ గ్రామాల్లో కథలుగా చెప్పుకుంటారు.

ప్రజా ప్రతినిధిగా సేవలు
రహస్య జీవితంలో కమలాదేవి ఆరోగ్యం దెబ్బతింది. ఆమెకు ట్రీట్ మెంట్ కోసం 1948లో బయటకొచ్చిన ఆరుట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాత కూడా జైల్లోనే ఉన్న రామచంద్రారెడ్డి 1952లో విడుదలయ్యారు. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నా ఓటర్ లిస్ట్ లో పేరు లేకపోవడంతో కుదరలేదు. అదే ఎన్నికల్లో కమలాదేవి ఆలేర్ నుంచి పోటీచేసి గెలిచారు. 1962లో భువనగిరి నుంచి పోటీచేసిన రామచంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. పోరాటా స్ఫూర్తితోనే ప్రజాప్రతినిధిగా సేవలు అందించారు. సిద్ధాంతం, సేవే ఆదర్శంగా జీవించిన రామచంద్రారెడ్డి 1985 అగష్టు 26న కన్నుమూశారు. నిస్వార్థంగా ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఈ విప్లవసేనాని సామాన్యులను కూడా ఉద్యమకారులుగా తీర్చిదిద్దారు. ఆయన సేవలను గుర్తు చేసుకునేంత చిన్న జాగా కూడా మన ట్యాంక్ బండ్పై దక్కలేదు.