ట్యాంక్ బండ్ చెప్పని కథలు–3

ట్యాంక్ బండ్ చెప్పని కథలు–3

తెలంగాణ రైతాంగ పోరును సాయుధ పోరాటంగా మార్చిన యోధుడు బద్దం ఎల్లారెడ్డి. 1904లో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో బద్దం ఎల్లారెడ్డి పుట్టారు. తల్లిదండ్రులు హన్మంతడ్డి, లక్ష్మమ్మ. ప్రజాస్వామ్య భావాలతో పెరిగిన ఎల్లారెడ్డి 1930లో శాసనోల్లంఘన ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చారు. రావి నారాయణరెడ్డితో కలిసి కాకినాడ సముద్ర తీరాన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. బ్రిటీష్ పోలీసులు ఎల్లారెడ్డిని అరెస్టు చేసి మద్రాస్ కు తరలిస్తే అక్కడి నుంచి తప్పించుకుని భీమవరం చేరుకున్నారు. అక్కడ పికెట్ నిర్వహించి మళ్ల అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి జైలులో ఏడునెలల జైలు శిక్ష తర్వాత విడుదలయ్యారు.

నిజాంకు వ్యతిరేకంగా
 
తర్వాత ఎల్లారెడ్డి గాలిపల్లిలో స్కూల్ ను స్థాపించి ఖద్దరు చొక్కా ఉద్యమాన్ని నడిపారు. ఆంధ్రమహాసభ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 1940లో ఆదివాసీ పోరాట యోధుడు కొమొరం భీమ్ ను నిజాం పోలీసులు హత్య చేసినప్పుడు ఎల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. రజాకార్ల అరాచకాన్ని ఎండగడుతూ తెలంగాణ అంతా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొమొరంను హత్యచేసిన ప్రాంతానికి వెళ్లి నిజ నిర్ధారణ నివేదికను తయారు చేశారు. అట్లా పౌర హక్కులపై స్పందించిన మొదటి వ్యక్తి బద్దం ఎల్లారెడ్డి. 1944లో భువనగిరిలో 11వ ఆంధ్రమహాసభలో రావి నారాయణడ్డి అధ్యక్షుడిగా, బద్దం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లాలోని గ్రామాలన్నీ తిరిగి నిజాంకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. దీంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి ఏడాది పాటు జైలులో ఉంచారు. జరిమానా కట్టడానికి పైసలు లేకపోవడంతో మరో మూడు నెలల జైల్లోనే ఉన్నారు.

గ్రామంలో నిర్బంధం
 
1947 సెప్టెంబర్ 13న నిజాంపై సాయుధ పోరాటానికి పిలుపునివ్వడంతో అనేక మంది యువకులు బద్దం బాటపట్టారు. ఎల్లారెడ్డి నాయకత్వంలో 1948 సెప్టెంబర్ 14న గాలిపెల్లిలో ఊరంతా కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. దీంతో నిజాం పోలీసులు గ్రామంలో నిర్బంధం పెట్టారు. దీనిపై ఎల్లారెడ్డి నాయకత్వంలో జనం కొడవళ్లు, గొడ్డళ్లు, బరిసెలతో తిరగబడ్డారు. నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో పదిమంది గ్రామస్థులు చనిపోయారు. ఈ కాల్పులకు ప్రతీకారంగా ఎల్లారెడ్డి సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

సాయుధపోరాట యోధుడిగా

సాయుధపోరాట కాలంలో ఎన్నో గ్రామాలకు పోయిన ఎల్లారెడ్డి గ్రామరక్షక దళాలకు స్వయంగా సాయుధ శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ పై పోలీస్ యాక్షన్ జరుగుతున్న కాలంలో ఆయన అనారోగ్యంతో బెంగళూరులో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ రాజ్యం స్వాతంత్య్రం సాధించి భారత్ లో విలీనమయ్యాక 1952లో కరీంనగర్ నుంచి పీడీఎఫ్ పార్టీ తరపున ఎంపీగా పోటీచేసి గెలిచారు. 1953లో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఎత్తివేశాక సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.1964లో రాజ్యసభకు ఎన్నికై సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 1968లో బుగ్గారం, 1972లో ఇందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. సాయుధపోరాట యోధుడిగా అనేక గ్రామాలను విముక్తం చేసిన ఎల్లారెడ్డి ప్రజాజీవితంలోనూ బలహీనవర్గాల మేలు కోసమే పనిచేశారు. 1978 డిసెంబర్ 28న అనారోగ్యంతో ఎల్లారెడ్డి కన్నుమూశారు.