వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు ఆఫీస్‌లోకి నో ఎంట్రీ

V6 Velugu Posted on Oct 08, 2021

కరోనా వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఆఫీసులకు రానీయకూడదని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేసుకోని వాళ్లు అక్టోబర్ 16 నుంచి ఆఫీసులకు రావొద్దంటూ ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌‌పర్సన్‌ విజయ్ దేవ్ ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఫ్రంట్‌ లైన్ వర్కర్లను లీవ్‌పై ఉన్నట్టు పరిగణిస్తామని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆఫీసులకు వచ్చే ఉద్యోగులను  ఆరోగ్య సేతు యాప్‌లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ పరిశీలించి మాత్రమే అనుమతించాలని అన్ని డిపార్ట్‌మెంట్ హెడ్స్‌ను ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఇటువంటి మార్గదర్శకాలను కేంద్రం అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్‌మెంట్లు, టీచర్లు, హెల్త్ సిబ్బంది అందరికీ అక్టోబర్‌‌ 15 లోగా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సెప్టెంబర్ 29న నిర్వహించిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మీటింగ్‌లో నిర్ణయించారు. ప్రజలతో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యే డిపార్ట్‌మెంట్లలోని ఉద్యోగులకు ముందుగా కనీసం ఒక డోస్ అయినా కరోనా వ్యాక్సిన్ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తొలి డోస్ కూడా పూర్తి కాని వారిని ఆ తర్వాతి రోజు నుంచి ఆఫీసులకు అనుమతించకూడదని, వ్యాక్సిన్ వేసుకునే వరకూ సెలవులో పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tagged Delhi, corona vaccine, Govt Employees

Latest Videos

Subscribe Now

More News