ఫోన్ ఉన్న అందరికీ అలర్ట్ : ఇయర్ బడ్స్ పెట్టుకోవటంతో చెవుడు వచ్చింది

ఫోన్ ఉన్న అందరికీ అలర్ట్ : ఇయర్ బడ్స్ పెట్టుకోవటంతో చెవుడు వచ్చింది

'చేతిలో మొబైల్.. చెవుల్లో ఇయర్ బడ్స్..' ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనడుతున్నాయి. ముఖ్యంగా యువత, రోజంతా వీటిని చెవిలో పెట్టుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. జర్నీ చేస్తున్నప్పుడు, తినేటప్పుడు, జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నప్పుడు.. ఇలా అన్ని చోట్లా వీటిని వాడుతున్నారు. ఇలా అతిగా ఇయర్ బడ్స్/ ఇయర్ ఫోన్స్ వాడే వారు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్, గోరఖ్ పూర్ కు చెందిన 18 ఏళ్ల బాలుడు ఇలానే  గంటల తరబడి ఇయర్ బడ్స్ వాడి వినికిడి శక్తి కోల్పోయాడు. 

అతిగా ఇయర్ బడ్స్ వాడడంతో అతని చెవుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో అతడు క్రమక్రమంగా వినికిడి శక్తి కోల్పోయాడు. వెంటనే ఆస్పత్రికి పరుగెత్తడంతో పరీక్షించిన వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేశారు. వినికిడి శక్తి కొంచెం మెరుగయ్యేలా చేశారు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. అయితే, గతంలో ఉన్నంత మెరుగ్గా అతడి వినికిడి శక్తి ఉంటుందని చెప్పలేమని డాక్టర్లు అన్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు ఎక్కువగా ఇయర్ ఫోన్స్/ ఇయర్ బడ్స్ వినియోగించి, ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. 

గంటల తరబడి ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవుల్లో తేమ శాతం పెరుగుతుంది. లోపలి నుంచి గాలి బయటకు.. బయట నుంచి గాలి లోపలికి వెళ్లదు. దీంతో చెవి లోపల చెమట ఎక్కువై, ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఫలితంగా వినికిడి శక్తి తగ్గుతుంది. దీనికి చికిత్స ఉన్నా.. అది ఏ దశలో ఉంది అనే దాన్నిబట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇన్ఫెక్షన్ లోపలికి దాకా చొచ్చుకుపోతే చికిత్స చేసినా ఫలితం ఉండకపోవచ్చు. కావున ఇయర్ ఫోన్స్/ ఇయర్ బడ్స్ వాడే వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


ఇయర్‌బడ్స్ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌లను నివారించడానికి జాగ్రత్తలు:

  • మీ ఇయర్‌బడ్స్ ను ఇతరులకు ఎప్పుడూ షేర్ చేయకండి. వారు మీ స్నేహితులు/ కుటుంబ సభ్యులు అయినా సున్నితంగా తిరస్కరించండి. 
  • ఇయర్‌బడ్స్/ హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మధ్యలో విరామం తీసుకోండి. 
  • ఒకవేళ ఎక్కువ సమయం ఉపయోగించాల్సి వచ్చినప్పుడు వాల్యూమ్‌ను తక్కువ స్థాయిలో ఉంచండి.
  • మీ చెవులను క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోండి.