పీఓకే ప్రజలు భారత్‌లోకి రావాలని కోరుకుంటున్నారు : యూపీ సీఎం యోగి

పీఓకే ప్రజలు భారత్‌లోకి రావాలని కోరుకుంటున్నారు : యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భారత చట్టాలే అమలవుతున్నాయని అన్నారు. శాంతి, అభివృద్ధితో కాశ్మీర్ ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా భారత్ లో భాగం కావాలని కోరుకుంటున్నారని, వారు కూడా భారత్ లో చేరాలని, పీఓకే భారత్ లో భాగం కావాలని కోరుకుంటున్నారని యోగి అన్నారు. పాకిస్తాన్ వెంట ఎవరూ నిలబడరని వ్యాఖ్యానించారు. 

జనసంపర్క అభియాన్‌ కింద అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా సంబంధాల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌పై సీఎం యోగి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారైందన్నారు. పాక్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, అక్కడ ఆహారం కోసం గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.

సంక్షోభంలో చిక్కుకున్న పలు దేశాలు ప్రస్తుతం భారత్ వైపు చూస్తున్నాయని, దీనంతటికి కారణం సమర్థవంతమైన పరిపాలన సాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కారణమని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎప్పటికీ తొలగించలేరని ప్రజలు అనుకున్నారని, కానీ.. ప్రధాని దాన్ని నిజం చేశారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కాశ్మీర్ భారత్ లో భాగమైందని చెప్పారు. 2024 జనవరిలో శ్రీరాముడి ఆలయం పూర్తవుతుందని, రాంలాలా తన ఆలయంలో కూర్చుంటారని తెలిపారు. 

ప్రస్తుతం భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేందుతోందని, భారత్ పై ప్రపంచదేశాల అభిప్రాయం కూడా మారిందని సీఎం యోగి చెప్పారు. గత తొమ్మిదేళ్ల క్రితం భారత్ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఉగ్రవాదుల చొరబాట్లు జరిగేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఉగ్రవాదులు ధైర్యం చేసి, అక్రమంగా భారత్ లోకి చొరబడితే వారిని మట్టుబెట్టేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు. తొమ్మిదేళ్ల క్రితం దేశంలో 115 జిల్లాలకు పైగా విస్తరించిన ఉగ్రవాదం, తీవ్రవాదం, మావోయిస్టులు, ఇవాళ కేవలం3, 4 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని, అది కూడా పూర్తిగా తగ్గిస్తామన్నారు.