యోగి చుట్టూ యూపీ ఎన్నికలు 

V6 Velugu Posted on Aug 17, 2021

వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల భవిష్యత్‌‌ను నిర్దేశించేవిగా మారనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణకు, ఆయన ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా ఈ ఎన్నికల ఫలితాలు మారనున్నాయి. ఏడేండ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ బొమ్మతోనే బీజేపీ ప్రచారం చేస్తోంది. చివరకు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన బొమ్మ చూపించే ఓటర్ల దగ్గరకు వెళుతోంది. కానీ, ఉత్తరప్రదేశ్​ ఎన్నికల్లో మాత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర బిందువు కానున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్‌‌కు కూడా ఈ ఎన్నికలు పెద్ద పరీక్షగా నిలవనున్నాయి. 

యోగిని మార్చాలనే ప్రచారం
దేశం మొత్తం మీద  క్షేత్రస్థాయి నుంచి వచ్చిన అతి కొద్దిమంది నాయకుల్లో యోగి ఒకరు. బీజేపీలో అయితే బీఎస్ యడియూరప్ప తర్వాత విశేష ప్రజాకర్షణ ఉన్న నేత ఆయనే. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ తర్వాత ఆయనే స్టార్ కాంపెయినర్. యోగి ఆదిత్యనాథ్‌‌ కాబోయే ప్రధాని అని యూపీలో అప్పుడే నినాదాలు మొదలయ్యాయి. 75 ఏండ్ల వయస్సు వచ్చిన తర్వాత ఏ పదవి లేదని బీజేపీ అమలు చేస్తున్న నిబంధన ప్రకారం ప్రధాని మోదీ 2025లో పదవి వదులుకోవలసి వస్తుంది. బీజేపీ నాయకత్వం మద్దతు లేకుండా ఆ విధంగా ప్రచారం జరిగి ఉండే అవకాశం లేదు. దాంతో యూపీలో ముఖ్యమంత్రిని మార్చాలనే నినాదం స్టార్ట్‌‌ అయ్యింది. ప్రధానికి సన్నిహితుడిగా పేరొందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే శర్మను హోమ్ శాఖతో ఉప ముఖ్యమంత్రిగా చేసి కీలక అధికార కేంద్రంగా చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వెంటనే ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రతినిధి వర్గాలు లక్నో చేరుకుని.. పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్యెల్యేలతో సమాలోచనలు జరిపారు. మీడియా ప్రచారానికి భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నట్లు వారు గ్రహించారు. యోగి లేకుండా యూపీలో బీజేపీ ఎన్నికలకు వెళ్లడం అసాధ్యమని గుర్తించారు. అందుకే ఆయన అధికారాలను కట్టడి చేయాలని వచ్చిన వారంతా ఆయన పాలనపై పొగడ్తలు కురిపిస్తూ తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఇక ఏకే శర్మను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి యోగి తిరస్కరించారు. బీజేపీలో ప్రధాని నుంచి వచ్చిన ప్రతిపాదనను ఒక ముఖ్యమంత్రి తిరస్కరించడం అసాధారణమే. అదే ఆదిత్యనాథ్ బలాన్ని వెల్లడి చేస్తోంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో నిత్యం పర్యటనలలో గడిపిన సీఎం బహుశా దేశంలో యోగి ఒక్కరే కావచ్చు. వాస్తవానికి బీజేపీ ఎప్పుడూ ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించదు. కానీ ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళుతున్నట్లు స్పష్టంగా ప్రకటిస్తున్నారు. పైగా నిత్యం ప్రధాని మోదీ, యోగి ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకనే దేశం దృష్టి మొత్తం యూపీ ఎన్నికలపై పడింది. యూపీలో గడిచిన 25 ఏండ్లలో అధికార పార్టీ ఏదీ రెండోసారి వరుసగా ఎన్నికల్లో గెలుపొందలేదు. ఆ సంప్రదాయాన్ని యోగి మారుస్తారా? ఇదే నేడు ఆసక్తికరంగా మారింది.

మీడియాలో నెగెటివ్ ప్రచారం 
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న 12 ఏండ్లపాటు మీడియాలో ఏ విధమైన ప్రతికూల ప్రచారం పొందారో, అంతకన్నా ఎక్కువగా నేడు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విపరీతమైన నెగెటివ్ ప్రచారాన్ని సీఎం యోగి పొందుతున్నారు. ఆయన సాధువు వస్త్రధారణ చూడగానే ఆయనను ఒక హిందూ మతోన్మాదిగా చిత్రీకరించడం సులభమవుతుంది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 26 ఏండ్లకే గోరఖపూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ముస్లింలు గణనీయంగా ఉండే నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు, ఎప్పటికప్పుడు మరింత ఎక్కువ మెజారిటీతో గెలుస్తూ వచ్చారు. అయినా ఆయనను 2014లో మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఆయన కూడా ఏనాడూ మంత్రి పదవి కోసం పాకులాడలేదు. నిత్యం తన నియోజకవర్గంలో తిరగడం, ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ప్రజాదర్బార్ నడిపి, ప్రజల సమస్యలకు తక్షణం స్పందించడం చేస్తూ వస్తున్నారు. యూపీలో మాయావతి, అఖిలేశ్​ యాదవ్ వంటి వారు సీఎంగా ఉన్న రోజులలో కూడా ఆయన ప్రజాసమస్యలపై జిల్లా మేజిస్ట్రేట్‌‌కు లేఖ రాస్తే వెంటనే సానుకూల స్పందనలు వస్తుండేవి. గోరఖ్‌‌పూర్ మఠం ఆధ్వర్యంలో సుమారు 50 విద్య, వైద్య, సేవా సంస్థలను నడుపుతున్నారు. వీటిల్లో పలువురు ముస్లింలు కూడా పనిచేస్తున్నారు. ఒక ముస్లిం డీన్‌‌గా కూడా ఉన్నారు. ఇమేజ్‌‌కు భిన్నంగా ఆయనకు స్థానిక ముస్లింలతో మంచి సంబంధాలున్నాయి. ఒక ఎంపీగా కూడా ఆయన లోక్‌‌సభలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. బీజేపీ ఎంపీ అయి ఉండి, వివిధ ప్రజా సమస్యలపై మోడీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ అనేక ప్రశ్నలు వేశారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు పర్యావరణం, విద్య, వైద్య, శాంతిభద్రతలు వంటి అనేక అంశాలపై పార్లమెంట్‌‌లో జరిగే చర్చల్లో పాల్గొనేవారు. ఈ విషయాలపై మీడియా ఎప్పుడూ దృష్టి సారించలేదు. 

60 లక్షల మందికి స్వయం ఉపాథి
2017 మార్చికి ముందు, యూపీలోని ఏ నగరానికీ మెట్రో కనెక్టివిటీ లేదు. ఇప్పుడు నాలుగు నగరాల్లో మెట్రో నిర్మిస్తున్నారు. నవంబర్ 2021 నాటికి కాన్పూర్, ఆగ్రాలో మెట్రో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దేశపు మొదటి జలమార్గాన్ని హల్దియా, వారణాసి మధ్య ప్రారంభించారు. కరోనా సమయంలో రైతుల కూరగాయలు, పండ్లను ఎగుమతి చేశారు. కరోనా సమయంలో వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కార్మికులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలివేస్తే, లాక్‌‌డౌన్ నిబంధనలను కూడా పట్టించుకోకుండా, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు రప్పించడమే  కాకుండా, వారికి వివిధ వృత్తులలో శిక్షణ ఇచ్చి, వారి పునరావాసానికి ఏర్పాట్లు చేశారు. పైగా, పొరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు కూడా ఆశ్రయం ఇచ్చారు. మొత్తమ్మీద 40 లక్షల మంది వలస కార్మికులు రాగా, ప్రతి ఒక్కరికీ నైపుణ్య శిక్షణ ఇచ్చారు. వారిని పరిశ్రమ, ఎన్జీవోలతో లింక్ చేశారు. నైపుణ్యాలు లేని వారికి టూల్‌‌కిట్‌‌లు, వనరులను సమకూర్చారు. యూపీలో నిరుద్యోగ రేటు ఇప్పుడు అతితక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. యోగి పాలనలో 4.5 లక్షల మంది యువతకు ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. పెట్టుబడులు వచ్చిన తర్వాత 1.61 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. స్టార్టప్ ఇండియా,  స్టాండప్ ఇండియా వంటి పథకాల ద్వారా 60 లక్షల మంది యువకులు స్వయం ఉపాధి పొందారు.

చలసాని నరేందర్, పొలిటికల్ ఎనలిస్ట్

Tagged UttarPradesh, CM Yogi Adityanath, UP, Up elections, chalasaani Narender

Latest Videos

Subscribe Now

More News