పాముతో పరాచకాలా?

పాముతో పరాచకాలా?

కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తికే బలవుతాడనే సామెత ఉంది. అలాగే పామును పట్టేవాడు ఆ పాముకాటుకే బలయ్యాడు. యూపీలోని షాజపూర్ కు చెందిన ఓ వ్యక్తి  ఎంతటి విష సర్పాన్ని అయినా ఇట్టే పట్టేస్తాడు. చుట్టుపక్కల గ్రామాల్లో పాములు పట్టే దేవేంద్ర మిశ్రా అంటే ఎంతో ఫేమస్. ఎవరి ఇంట్లోకి పాము దూరినా అతడినే సంప్రదించేవారు. ఎంతో చాకచక్యంగా పాములను పట్టేవాడు.  అనంతరం వాటిని గోనెసంచిలో వేసుకుని భద్రంగా అడవిలో వదిలిపెట్టేవాడు. ఈనెల 18న షాజపూర్ లో  రవీంద్ర అనే వ్యక్తి ఇంట్లోకి పాము దూరింది. వెంటనే దేవేంద్రకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతడు పామును పట్టుకుని గోనె సంచిలో వేశాడు. 

తాను పట్టుకున్న పామును ప్రజలకు చూపించేందుకు గోనె సంచిలో నుంచి బయటకు తీశాడు. దాదాపు గంటన్నరసేపు దానితో ఆడుకున్నాడు. అందరూ దీన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. అనూహ్యంగా దేవేంద్ర పామును పట్టుకోవడంలో పట్టు కోల్పోయాడు. వెంటనే అది దేవేంద్రను కాటేసింది. అయినా.. దాన్ని ఓ పాత్రలో బంధించాడు. పాత్రలో ఊపిరి ఆడక అది చనిపోయింది. ఆస్పత్రిలో రెండ్రోజుల చికిత్స నిమిత్తం దేవేంద్ర కూడా చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతడి మరణవార్త విని స్థానికులు కంటతడి పెట్టారు.