పెళ్లికూతురి కోసం సైకిల్ పై 100 కిలోమీటర్లు వెళ్లిన యువ‌కుడు: తాళి క‌ట్టి..

పెళ్లికూతురి కోసం సైకిల్ పై 100 కిలోమీటర్లు వెళ్లిన యువ‌కుడు: తాళి క‌ట్టి..

ప్ర‌తి ఏటా స‌మ్మ‌ర్ లో ఎక్క‌డ చూసినా పెళ్లిళ్ల సంద‌డి క‌నిపించేది. కానీ ఈ సంవ‌త్స‌రంలో క‌రోనా లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా ల‌క్ష‌లాది వివాహాలు నిలిచిపోయాయి. క‌రోనా విల‌యం త‌గ్గిన త‌ర్వాత పెళ్లిళ్లు పెట్టుకోవ‌చ్చ‌ని చాలా మంది వాయిదా వేసుకున్నారు. అయితే కొంత మంది మాత్రం బంధుమిత్రులెవ‌రూ లేకుండా కేవ‌లం వ‌ధూవ‌రులు, వాళ్ల త‌ల్లిదండ్రులు సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ ఏ సంద‌డి లేకుండా పెళ్లి ముగించారు. మ‌రికొంద‌రైతే ఆన్ లైన్ లోనే వివాహాలు చేసేసుకున్నారు. తాజాగా ఉత్త‌రప్ర‌దేశ్ లో 23 ఏళ్ల యువ‌కుడు త‌న పెళ్లి కోసం 100 కిలోమీట‌ర్ల దూరం సైకిల్ పై వెళ్లాడు. ఒక్క‌డే పెళ్లి కుమార్తె ఊరికి వెళ్లి గుడిలో తాళి క‌ట్టి.. మ‌ళ్లీ అంత దూరం జంట‌గా ప్ర‌యాణం చేశారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో హ‌మిర్పూర్ జిల్లా పౌతియా గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువ‌కుడు క‌ల్కూ ప్ర‌జాప‌తికి నాలుగు నెల‌ల క్రిత‌మే పెళ్లి ఫిక్స్ అయింది. మ‌హోబా జిల్లా పునియా గ్రామానికి చెందిన యువ‌తి రింకీతో వివాహానికి పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఏప్రిల్ 25వ తేదీన సంబ‌రంగా పెళ్లి చేయాల‌ని ముహుర్తం పెట్టుకున్నారు. కానీ క‌ల‌లోనైనా ఊహించ‌ని విధంగా ప్ర‌పంచ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాచింది. ఈ వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉండ‌డంతో ఆ జంట పెళ్లి చేసేందుకు పెద్ద‌లు పోలీసుల ప‌ర్మిష‌న్ కోసం ప్ర‌య‌త్నించారు. కానీ అనుమతి రాక‌పోవ‌డంతో ఒక్క‌డే అయిన వ‌చ్చి పెళ్లి చేసుకోవాల్సిందిగా యువ‌తి త‌ల్లిదండ్రులు అత‌డిని కోరారు. దీంతో దాదాపు 100 కిలో మీట‌ర్ల దూరం సైకిల్ పై ప్ర‌యాణం చేయ‌డానికి రెడీ అయ్యాడు. ‘వాస్త‌వానికి నాకు బైక్ ఉంది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మ‌ధ్య‌లో పోలీసులు ఆపితే స‌మ‌స్య అవుతుంద‌ని సైకిల్ ప్ర‌యాణ‌మే బెస్ట్ అని నిర్ణ‌యించుకున్నా’ అని చెబుతున్నాడు ప్ర‌జాప‌తి. ముఖానికి క‌ర్చీఫ్ క‌ట్టుకుని, పెళ్లికి ముందు రోజు ఉద‌యం జీన్స్, టీ ష‌ర్టులో సైకిల్ పై బ‌య‌లుదేరాన‌ని తెలిపాడు. ముహుర్తానికి కొన్ని గంట‌ల ముందే అమ్మాయి ఇంటికి చేరుకున్నాన‌ని, ఇక ప్ర‌త్యేకంగా పెళ్లి బ‌ట్ట‌లు కూడా లేకుండా సాధార‌ణంగా ఓ గుడిలో రింకీని వివాహ‌మాడాన‌ని చెప్పాడు.

రెండు కుటుంబాలు హ్యాపీ… కానీ నేనే..

అనుకున్న స‌మ‌యానికి పెళ్లి జ‌ర‌గ‌డంతో త‌మ రెండు కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయ‌ని చెప్పాడు ప్ర‌జాప‌తి. కానీ పెళ్లి కోసం ఇంత క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని క‌ల‌లోనై ఊహించ‌లేద‌ని అంటున్నాడ‌త‌ను. సైకిల్ పై త‌న భార్య‌తో మ‌ళ్లీ తిరుగు ప్ర‌యాణ‌మై అతి క‌ష్టం మీద ఇంటికి చేరుకున్నాన‌ని చెప్పాడు.
“వెళ్లేట‌ప్పుడు ఎలాగో అమ్మాయి ఊరు చేరుకున్నా… తిరుగు ప్ర‌యాణంలో సైకిల్ పై భార్య‌ను కూడా ఎక్కించుకుని తొక్కాల్సి వ‌చ్చింది. అతి క‌ష్టం మీద ఇద్ద‌రం ఇంటికి వ‌చ్చాం. అంతా సంతోషంగా ఉన్నా ఈ స‌మ‌యంలో కాళ్ల నొప్పుల‌తో క‌నీసం నిద్ర ప‌ట్ట‌లేదు. ఇక ఏం చేయ‌లేక నిద్ర మాత్ర‌లు వేసుకుని ప‌డుకున్నాను” అని చెప్పాడు ప్ర‌జాప‌తి. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియ‌ద‌ని, బ‌రాత్ లాంటివి ఏమీ పెట్టుకోవ‌డం కుద‌ర‌డం లేద‌ని అన్నాడు. జీవితంలో పెళ్లి అనేది మ‌ర్చిపోలేని జ్ఞాప‌కంలా ఉండాల‌ని అనుకున్నాన‌ని కానీ, ఇలా జ‌రుగుతుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని చెబుతున్నాడు.