ఎస్సీలు, మైనారిటీలకు యూపీ సేఫ్​ కాదు

ఎస్సీలు, మైనారిటీలకు యూపీ సేఫ్​ కాదు
  • వాళ్లపై దాడులు దేశంలో అక్కడే ఎక్కువ
  • మూడేళ్లలో ఎన్​హెచ్ఆర్సీ లో 869 కేసులు నమోదు
  • దేశ వ్యాప్తంగా 2,008 కేసులు

ఉత్తరప్రదేశ్.. దేశంలోనే అతిపెద్ద రాష్ర్టం. అక్కడ ఓబీసీల తర్వాత ముస్లింలు, దళితుల జనాభానే ఎక్కువ. సెన్సిటివ్ ఏరియాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. దీంతో చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలకు ఆస్కారం ఎక్కువ. అయితే గతంలో కంటే ఇప్పుడు యూపీలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు. నేరాలు తగ్గాయని యూపీ పోలీస్ శాఖ కూడా గట్టిగా చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్​హెచ్ఆర్సీ) రికార్డులు చెబుతున్నాయి. మైనారిటీలు, దళితులపై దాడులు, వేధింపులు దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్​లో జరుగుతున్నాయని వెల్లడిస్తున్నాయి.

మూడేళ్లలో 869 కేసులు

2016 నుంచి 2019 జూన్ వరకు దళితులు, మైనారిటీలపై జరిగిన దాడులకు సంబంధించి దేశవ్యాప్తంగా 2,008 కేసులను ఎన్​హెచ్ఆర్సీ నమోదు చేసింది. ఇందులో ఒక్క ఉత్తరప్రదేశ్​లోనే 869 కేసులు నమోదయ్యాయి. దేశంలో జరిగిన మొత్తం దాడుల్లో ఇది 43 శాతం. మరే రాష్ర్టంలోనూ 10 శాతానికి మించి నమోదు కాలేదు. ఇవి ఎన్​హెచ్ఆర్సీలో నమోదైన కేసులు మాత్రమే. నమోదు కానివి ఇంకా చాలానే ఉండే అవకాశం ఉందంటున్నారు. మూక దాడి చేసి చంపిన ఘటనలు కూడా ఎన్​హెచ్ఆర్సీ నమోదు చేసిన కేసుల్లో ఉన్నాయి. ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖ ఈ నెల 16న పార్లమెంటులో వెల్లడించింది. గత మూడేళ్లలో మైనారిటీలు, దళితులపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ కె.నవాస్​కని అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానమిచ్చింది.

దళితులపై పెరుగుతున్నయి

ఎన్​హెచ్ఆర్సీ రిజిస్టర్ చేసిన కేసులను ఒకసారి పరిశీలిస్తే మైనారిటీలపై జరుగుతున్న దాడులు తగ్గినట్లు తెలుస్తోంది. కానీ దళితులపై వేధింపులు మాత్రం క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. మైనారిటీలను వేధించడానికి సంబంధించి 2016–17 మధ్య ఎన్​హెచ్​ఆర్సీలో 117 కేసులు నమోదయ్యాయి. 2017–18లో ఆ సంఖ్య 67కు తగ్గగా, 2018–19లో 79కి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు)లో ఇప్పటిదాకా ఐదు కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇదే సమయంలో గత మూడేళ్లతో పోలిస్తే దళితులపై జరుగుతున్న దాడులు 33 శాతం పెరిగాయి. 2016–17లో 505 కేసులు, 2018–19లో 672, ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 99 కేసులు నమోదయ్యాయి.

హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే..

ఎక్కువగా హిందీ మాట్లాడే రాష్ర్టాల్లోనే మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతున్నాయని ఎన్​హెచ్​ఆర్సీ డేటా చెబుతోంది. ఆవుల్ని పవిత్రంగా భావించే  యూపీ, రాజస్థాన్, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో 64 శాతం కేసులు రికార్డయ్యాయి. వీటికి గుజరాత్, ఢిల్లీ, ఉత్తరాఖండ్​ను కూడా కలిపితే.. అది 75 శాతానికి చేరుతుంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కలిపి మొత్తంగా 9.5 శాతం కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఎనిమిది ఈశాన్య రాష్ర్టాల్లో కలిపి 0.54 శాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ర్టాల్లో కలిపి 5.17 శాతం కేసులు రికార్డయ్యాయి.