
- ఏప్రిల్ నుంచి రూ.2 కోట్ల కూలీ డబ్బులు పెండింగ్
- జిల్లాలో అస్తవ్యస్తంగా ఉపాధి హామీ పథకం
ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో ఉపాధి కూలీల డబ్బులను బ్యాంకర్లు క్రాప్ లోన్ల కింద జమ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు రైతు బంధు ద్వారా వచ్చిన డబ్బులను లోన్ల కింద జమ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉపాధి కూలీల డబ్బులను హోల్డ్ లో పెడుతుండటంతో బ్యాంకర్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బ్యాంకర్లు ఉపాధి కూలీల డబ్బులపై పడుతున్నారు. వేసవిలో వ్యవసాయ పనులు ఉండవు. దాదాపు గ్రామాలన్నీ ఉపాధి హామీ పనులకు వెళ్తుంటారు. ఎండ తీవ్రతను తట్టుకొని పని చేస్తున్న కూలీలకు రావాల్సిన డబ్బులను బ్యాంకర్లు కట్ చేసుకుంటున్నారు. గతేడాది ఉపాధి పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్ వేర్ తీసుకొచ్చింది. దీంతో జాబ్ కార్డులు ఉన్న కూలీల ఆధార్ నెంబర్లు అనుసంధానం చేశారు. దీని వల్ల బ్యాంక్ ఖాతాలతో పాటు పోస్టాఫీసుల్లో ఉన్న ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇదే అదునుగా భావించిన బ్యాంకర్లు ఉపాధి కూలీ డబ్బులు పడిన వెంటనే లోన్ల కింద జమ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్చి నెలలో చేసిన కూలీ డబ్బులు బ్యాంక్ లోనే కట్ చేసుకున్నట్లు కూలీలు వాపోతున్నారు.
ప్రతి వారం ఒక్కో కూలీ రూ. 1000 సంపాదిస్తాడు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళా సంఘాలు ఉపాధి కూలీ డబ్బులపైనే ఆధారపడుతుంటారు. ఇలాంటి వారికి వచ్చే ఆ కాస్త డబ్బులు కూడా బ్యాంకులు జమ చేసుకోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క పని చేసిన డబ్బులు కట్ చేసుకుంటుండగా.. చే పెండింగ్ లో ఉన్న కూలీ డబ్బులు ఇప్పిస్తామంటూ కొంత మంది బీఆర్ఎస్ లీడర్లు కూలీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బేల మండలంలో ఇటీవల బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి పర్యటించిన సందర్భంగా ఉపాధి కూలీలు ఈ విషయాన్ని బయటపెట్టారు. చేసిన పనికి డబ్బులు రాకా.. వచ్చిన డబ్బులు బ్యాంకర్లు తీసుకోవడం వల్ల అసలు కూలీ ఎందుకు చేస్తున్నామో తెలియడం లేదని వాపోతున్నారు.
కూలీ డబ్బులు పెండింగ్..
ఆదిలాబాద్ జిలా వ్యాప్తంగా 1.70 లక్షల జాబ్ కార్డులు ఉండగా అందులో 2.50 లక్షల మంది కూలీలు ఉన్నారు. వేసవి కావడంతో రెండు నెలలు నుంచి పనులు ఊపందుకున్నాయి. ప్రతి రోజు 50 వేల మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. వీరందరికి ప్రతి వారం కూలీ డబ్బులు జమ కావాలి. గత ఏప్రిల్ నుంచి అసలు కూలీ డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. 2 కోట్ల ఉపాధి కూలీ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
ఉపాధి కూలీ కింద వచ్చే డబ్బులను జమ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ఉపాధి పనులు చేసిన కూలీలకు నేరుగా బ్యాంకుల్లోనే కూలీ డబ్బులు జమ అవుతున్నాయి. డబ్బులు బ్యాంకర్లు తీసుకోవాలనేది నిబంధనలు లేవు.
–కిషన్, ఆర్డీవో
కుటుంబ పోషణ భారంగా ఉంది..
నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన షేక్ ఛాన్వి, జమాల్ దంపతులు ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్నారు. ఐదు వారాల నుంచి ఒక్కరూపాయి రావడం లేదు. ఉపాధి హామీ డబ్బులతోనే మా కుటుంబాన్ని పోషిస్తున్నామని డబ్బులు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు.
రూ. 5 వేలు కట్ చేశారు
బేల మండలం పలాయి తాండకు చెందిన చాపర్ బాయ్ బ్యాంకులో క్రాప్ లోన్ పెండింగ్ లో ఉండటంతో ఉపాధి కూలీ కింద జమయిన రూ. 5 వేలు బ్యాంకర్లు కట్ చేశారు. దీంతో ఎండలో కష్టపడి పనిచేసిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చాపరిబాయితో పాటు ఈ గ్రామానికి చెందిన దాదాపు 20 మంది వరకు క్రాప్ లోన్లు, డ్వాక్రా లోన్లు ఉన్నాయని ఉపాధికూలీ డబ్బులు బ్యాంకర్లు జమ చేసుకోవడం గమనార్హం.