నెట్​ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్లు

నెట్​ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్లు
  • జులైలో యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ రూ. 6 లక్షల కోట్లు
  • 325 కోట్లకు ట్రాన్సాక్షన్ల నెంబర్‌‌
  • కార్డు పేమెంట్స్​ వెనకబడుతున్నయ్​

న్యూఢిల్లీ: యూపీఐ (యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ఫేస్​) ట్రాన్సాక్షన్లు అంతకు ముందు ఏడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులై నెలలో 42 శాతం పెరిగాయి. విలువపరంగా ఈ ట్రాన్సాక్షన్లు జులైలో రూ. 6.06 లక్షల కోట్లని, జూన్​ 2021లోని రూ. 5.47 లక్షల కోట్ల రికార్డును దాటేశాయని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) డేటా వెల్లడించింది. జులై 2021లో కార్డుల ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లు రూ. 1.36 లక్షల కోట్లకే పరిమితమయ్యాయని పేర్కొంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్​లోని రూ.95,883 కోట్లతో పోలిస్తే ఇవి బాగా పెరిగాయని, ఎకానమీ రికవరీతోనే ఇది సాధ్యమైందని ఆర్​బీఐ డేటా వివరించింది. రోజువారీ అవసరాలకు కొనే వాటికి, ప్రీమియం కొనుగోళ్లకూ కూడా డిజిటల్​  ట్రాన్సాక్షన్లే చేస్తుండటంతో యూపీఐ ప్లాట్​ఫామ్స్​ ఏకంగా 109 శాతం గ్రోత్​ సాధించాయి. ఆన్​లైన్​ పేమెంట్లలో ఎక్కువగా క్రెడ్​ వంటి యూపీఐ యాప్స్​ ద్వారానే జరుగుతున్నాయని ఇంప్రెసేరియో హ్యాండ్​మేడ్​ రెస్టారెంట్ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ రియాజ్​ అమ్లాని చెప్పారు. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ల ఏవరేజ్​ వాల్యూ కూడా కరోనా సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​ తర్వాత 20 శాతం పెరిగిందని అన్నారు. ఎకానమీ రికవరీతో ఇతర ఖర్చులను కన్జూమర్లు  పెంచినప్పటికీ, కార్డు ట్రాన్సాక్షన్లు యూపీఐ ప్లాట్​ఫామ్స్​తో పోటీ పడలేకపోతున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ట్రాన్సాక్షన్ల పరంగా చూస్తే జులై నెలలో యూపీఐ ద్వారా 325 కోట్లు (3.25 బిలియన్లు) రికార్డయ్యాయి.  ఇదే కాలంలో కార్డుల ద్వారా జరిగినవి 52 కోట్లే (520 మిలియన్​లే). యూపీఐ పేమెంట్లు గత ఏడాది కాలంగా భారీగా పెరుగుతున్నాయని లె మార్చె చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ అమిత్​ దత్తా వెల్లడించారు. సులభంగా ఉండడానికి తోడు, కాంటాక్ట్​లెస్​ కావడంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. కార్డు పేమెంట్ల కంటే వేగంగా యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నాయని బ్యాంకర్లూ చెబుతున్నారు. ఫ్యూచర్లోనూ ఇదే ట్రెండ్​ కొనసాగుతుందని యాక్సిస్​ బ్యాంక్​ హెడ్​ సంజీవ్​ మోఘె చెప్పారు. మర్చంట్లకు చెల్లింపులకే కార్డులు వాడుతున్నారు. కార్డుల చెల్లింపులు ఏటా 30–40 శాతం పెరిగితే ఆరోగ్యకరమేనని ఆయన పేర్కొన్నారు. తమ సేల్స్​లో 10 నుంచి 15 శాతం యూపీఐ పేమెంట్​ ప్లాట్​ఫామ్స్​, వాలెట్స్​ నుంచే వస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్​ రిటెయిల్​ చెయిన్ విజయ్​ సేల్స్​ డైరెక్టర్​ నీలేష్​ గుప్తా చెప్పారు. ఎక్కువ విలువైన వస్తువులకు కూడా కొన్నిసార్లు యూపీఐ ప్లాట్​ఫామ్స్​ ద్వారానే కన్జూమర్లు చెల్లిస్తున్నట్లు వివరించారు.

నెట్​ లేకుండానే....యూపీఐ
యూపీఐ పేమెంట్స్​ జరపాలంటే ఖరీదైన ఫోన్లుంటేనే వీలవుతుందని చాలా మంది అనుకుంటారు. ఇంటర్​నెట్​ లేని  ఫీచర్ ఫోన్ల నుంచీ యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయొచ్చు. *99# కి డయల్​ చేయడం ద్వారా ఫీచర్​ ఫోన్ల నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్​ చేయడం చాలా ఈజీ అని ఎన్​పీసీఐ చెబుతోంది. బాలెన్స్​ ఎంక్వయిరీ, యూపీఐ పిన్​ ఛేంజ్​, ట్రాన్సాక్షన్లు వంటివన్నీ చేసుకోవచ్చని వివరిస్తోంది. మెనూ ఆధారంగా సులభంగా ట్రాన్సాక్షన్లు చేసుకోవడానికి అనువుగా దీనిని డెవలప్​ చేసినట్లు పేర్కొంది. రిజిస్టర్డ్​ మొబైల్​ నుంచి *99#  కి డయల్​ చేయడం ద్వారా ఈ సర్వీస్​లను పొందవచ్చు.