ఫోన్‌‌పే,  గూగుల్‌‌ పేకి ఊరటనిచ్చిన ఎన్‌‌పీసీఐ

ఫోన్‌‌పే,  గూగుల్‌‌ పేకి ఊరటనిచ్చిన ఎన్‌‌పీసీఐ

న్యూఢిల్లీ: ఫోన్‌‌పే,  గూగుల్‌‌ పేకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌‌పీసీఐ) నుంచి  ఊరట లభించింది.  పేమెంట్స్ వాల్యూమ్స్‌‌లో మార్కెట్‌‌ క్యాప్‌‌ను గరిష్టంగా  30 శాతానికి పరిమితి చేయడాన్ని ఇంకో రెండేళ్లకు వాయిదా వేసింది. వచ్చే  నెల 1 నుంచి ఈ గైడ్‌‌లైన్స్ అమల్లోకి రావాల్సి ఉంది. కాగా,  యూపీఐ నెట్‌‌వర్క్ వాడుతున్న థర్డ్ పార్టీ కంపెనీలు అంటే ఫోన్‌‌పే, పేటీఎం వంటి కంపెనీల పేమెంట్స్ ట్రాన్సాక్షన్లు మొత్తం వాల్యూమ్‌‌లో 30 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని 2020, నవంబర్‌‌‌‌లో ఎన్‌‌పీసీఐ   గైడ్‌‌లైన్స్‌‌ ప్రకటించింది. అంటే  ట్రాన్సాక్షన్ల సంఖ్య ఒకానొక లెవెల్‌‌కు చేరుకున్నాక ఈ కంపెనీల నుంచి కొత్త ట్రాన్సాక్షన్లు జరగవు. మార్కెట్‌‌ వాటా మరింతగా పెరగకుండా ఉండేందుకు ఈ కంపెనీలు కొత్త యూజర్లను తమ ప్లాట్‌‌ఫామ్‌‌లో జాయిన్‌‌ చేసుకోవడానికి భయపడే వీలుంటుంది. తాజాగా ఈ గైడ్‌‌లైన్స్‌‌ను అమలు చేయడాన్ని  డిసెంబర్‌‌‌‌ 31, 2024 కు ఎన్‌‌పీసీఐ వాయిదా వేసింది. ఈ కొత్త గైడ్‌‌లైన్స్‌‌ను వాయిదా వేయాలని   ఫోన్‌‌పే, గూగుల్ పేలు ఎన్‌‌పీసీఐను  గతంలో కోరాయి. ఈ గైడ్‌‌లైన్స్ అమల్లోకి వస్తే ఆన్‌‌లైన్ పేమెంట్స్ ఎకోసిస్టమ్‌‌లో ఇన్నోవేషన్స్‌‌కు తావుండదని అప్పుడు  పేర్కొన్నాయి.

80 శాతం వాటా ఈ రెండు కంపెనీలదే..

ప్రస్తుత యూపీఐ వాడకాన్ని, ఫ్యూచర్‌‌‌‌లో మరింతగా విస్తరించగలిగే సామర్ధ్యాన్ని, ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకొని థర్డ్‌‌పార్టీ యాప్స్‌‌పై విధించిన రూల్స్‌‌ను అమలు చేయడాన్ని వాయిదా వేస్తున్నామని ఎన్‌‌పీసీఐ పేర్కొంది. 2024, డిసెంబర్ 31 నుంచి ఆన్‌‌లైన్ పేమెంట్ కంపెనీల  పేమెంట్స్ వాల్యూమ్స్‌‌పై పరిమితులు విధిస్తారు. డిజిటల్ పేమెంట్స్  ప్రస్తుత స్టేజ్‌‌ నుంచి మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఎన్‌‌పీసీఐ తెలిపింది. ఇతర కంపెనీలు  తమ పేమెంట్స్ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి టైమ్ పడుతుందని అభిప్రాయపడింది. ఈ ఏడాది అక్టోబర్​లో ఏకంగా 340 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి.  ఇందులో ఫోన్‌‌పే ద్వారా 47.2 శాతం ట్రాన్సాక్షన్లు, గూగుల్ పే ద్వారా 34 శాతం ట్రాన్సాక్షన్లు జరిగాయి. యూపీఐ పేమెంట్స్‌‌లో ఈ రెండు కంపెనీల వాటానే  8‌‌‌‌0 శాతం (249 కోట్ల ట్రాన్సాక్షన్ల) కంటే ఎక్కువ ఉంది. వాట్సాప్ పే వాటా 0.1 శాతంగా, అమెజాన్ పే వాటా 0.4 శాతంగా, పేటీఎం వాటా సింగిల్ డిజిట్‌‌లో  రికార్డయ్యాయి.  ఈ కొత్త గైడ్‌‌లైన్స్‌‌ అమలును వాయిదా వేయడంతో  ఫోన్‌‌పేకి ఊరట లభించింది. ఈ కంపెనీ 12 బిలియన్ డాలర్ల దగ్గర ఫండింగ్ సేకరించాలని చూస్తోంది. 

ఆల్టర్నేటివ్స్ లేవు..

యూపీఐ భారీగా విస్తరించడంలో ఫోన్‌‌‌‌‌‌పే, గూగుల్‌‌‌‌ పే  పాత్ర కీలకంగా ఉందనే చెప్పాలి. వాట్సాప్ లాంటి పెద్ద సంస్థలు తమ ఆన్‌‌‌‌లైన్ పేమెంట్ సర్వీస్‌‌‌‌లను స్టార్ట్ చేసినప్పటకీ, సక్సెస్ కాలేకపోయాయి. వాట్సాప్ పే కింద 10 కోట్ల మంది యూజర్లు రిజిస్టర్ అయ్యారు. కానీ, ఈ యాప్ ద్వారా జరుగుతున్న ట్రాన్సాక్షన్లు మాత్రం 0.1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ‘ఆన్‌‌‌‌లైన్ పేమెంట్స్ మార్కెట్‌‌‌‌ను ఫోన్‌‌‌‌పే, గూగుల్‌‌‌‌ పేలు డామినేట్ చేస్తున్నాయి. వీటిని మినహాయిస్తే మార్కెట్‌‌‌‌లో పెద్దగా ఆల్టర్నేటివ్‌‌‌‌ కనిపించడం లేదు. ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ కొత్త కస్టమర్లను జాయిన్ చేసుకోకపోయినా లేదా  ట్రాన్సాక్షన్ లిమిట్ ఒకానొక లెవెల్‌‌‌‌ చేరాక పరిమితులు విధించినా  ఆన్‌‌‌‌లైన్ పేమెంట్స్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో అంతరాయం ఏర్పడుతుంది’ అని ఎనలిస్టులు పేర్కొన్నారు.   ‘ఈ రూల్స్ అన్నింటిని ఫాలో కావడం వలన మార్కెట్ షేరు తగ్గుతుందని ఆందోళన పడడం లేదు.  మార్కెట్ షేరు తగ్గించుకోవడంలో నేను చేయాల్సింది చాలా తక్కువ. ఈ విషయంలో   యూజర్ల ప్రిఫరెన్స్‌‌‌‌ కీలకంగా ఉంటుంది’ అని ఫోన్‌‌‌‌పే సీఈఓ సమీర్‌‌‌‌‌‌‌‌ నిగమ్ గతంలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యూనే గూగుల్ పే కూడా 
వ్యక్తం చేసింది.