ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ లకు వెళ్తున్నారా.? ఈ వస్తువులు తీసుకెళ్తే.. స్టేడియంలోకి నో ఎంట్రీ

ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ లకు వెళ్తున్నారా.? ఈ  వస్తువులు తీసుకెళ్తే.. స్టేడియంలోకి నో ఎంట్రీ

హైదరాబాద్‌లో క్రికెట్ సందడి మొదలు కాబోతుంది .టాటా ఐపీఎల్-2026 మ్యాచ్‌లు ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ క్రమంలో స్టేడియం పరిసరాలపై సిటీ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మ్యాచ్‌లు ప్రశాంతంగా జరిగేలా ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ,  ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో స్టేడియం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఆర్మ్డ్ రిజర్వ్,  బాంబ్ డిస్పోజల్ టీమ్‌లు సమన్వయంతో పనిచేయనున్నాయి. స్టేడియం లోపల, బయట కలిపి మొత్తం 430 సీసీ కెమెరాలను అమర్చారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి కదలికను నిశితంగా పర్యవేక్షించనున్నారు.

ప్రేక్షకుల భద్రత దృష్ట్యా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.  మద్యం, గాజు సీసాలు, కత్తులు, లైటర్లు, లేజర్ పాయింటర్లకు స్టేడియంలోకి అనుమతి లేదు.  బ్యాగులు వంటి వస్తువులను కూడా లోపలికి తీసుకురావద్దని స్పష్టం చేశారు.  ప్రతి గేట్ వద్ద అధునాతన స్కానింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. 

గేట్ నంబర్ 1 కేవలం ఆటగాళ్ల ప్రవేశం కోసం మాత్రమే కేటాయించారు.ట్రాఫిక్ కష్టాలు కలగకుండా ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తున్నారు. స్టేడియం వద్ద టూ-వీలర్, ఫోర్-వీలర్ పార్కింగ్ కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. అయితే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రేక్షకులు వీలైనంత వరకు ఆర్టీసీ బస్సులు,మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. చెల్లుబాటు అయ్యే టికెట్ ఉన్నవారు మాత్రమే సరైన గేట్ల ద్వారా ప్రవేశించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మ్యాచ్‌లు సాఫీగా సాగేలా హైదరాబాద్ పోలీసులు సర్వం సిద్ధం చేశారు.