UPSC: పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక నిర్ణయం.. ఇకపై మొత్తం మారిపోనుంది..

UPSC: పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక నిర్ణయం.. ఇకపై మొత్తం మారిపోనుంది..

న్యూఢిల్లీ: ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో యూపీఎస్సీ (UPSC) కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్లు తెలిసింది. యూపీఎస్సీ పరీక్షల నిర్వహణలో మోసాలను అరికట్టేందుకు డిజిటల్ టెక్నాలజీని వినియోగించాలని భావిస్తోంది. యూపీఎస్సీ అభ్యర్థులకు ఆధార్-బేస్డ్ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్, ఫేస్ రికగ్నైజేషన్ తప్పనిసరి చేయాలనే యోచనలో యూపీఎస్సీ ఉంది.

పరీక్షల నిర్వహణ సమయంలో మోసాలకు తావు లేకుండా క్యూఆర్ కోడ్ విధానంలో ఈ-అడ్మిట్ కార్డ్స్ను స్కాన్ చేయాలని నిర్ణయించింది. పరీక్షల నిర్వహణ విధానంలో ఈ మార్పులుచేర్పులు చేసేందుకు సాంకేతిక పరికరాలు అవసరం పడుతుండటంతో టెండర్లు పిలవాలని యూపీఎస్సీ భావిస్తోంది. ఆధార్-బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ (డిజిటల్ ఫింగర్ ప్రింట్ క్యాప్చరింగ్), క్యాండిడేట్ ఫేసియల్ రికగ్నైజేషన్, ఈ-అడ్మిట్ కార్డుల క్యూఆర్ కోడ్ స్కానింగ్, లైవ్ ఏఐ-ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణ కోసం సాంకేతిక పరికరాలను యూపీఎస్సీ తెప్పించుకోనుంది. 

ALSO READ | అగ్నివీర్, నీట్ రద్దు చేయండి .. కేంద్రానికి చిదంబరం ఐదు డిమాండ్లు

యూపీఎస్సీ ప్రతి సంవత్సరం 14 పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలన్నీ ఇకపై అవకతవకలకు ఏమాత్రం తావు లేకుండా నిర్వహించాలని యూపీఎస్సీ పట్టుదలతో ఉంది. ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ ఫేక్ డాక్యుమెంట్లతో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిందని తేలడంతో యూపీఎస్సీ అలసత్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలొచ్చాయి. ఖేడ్కర్పై యూపీఎస్సీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. పూజా ఖేడ్కర్ కేసును ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పరీక్షల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించిన యూపీఎస్సీ గత మూడేళ్లుగా పరీక్షల నిర్వహణకు  సంవత్సరానికి రూ.100 కోట్లు ఖర్చు చేసింది. మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూలు, వెరిఫికేషన్ ప్రక్రియ.. వీటన్నింటికీ సంవత్సరానికి రూ.100 కోట్లు ఖర్చవుతున్నట్లు సమాచారం.