వెహికల్ చలాన్స్ పై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్స్

వెహికల్ చలాన్స్ పై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్స్
  • ఈ నెల 31వరకు‌ అందుబాటులో ఆఫర్‌
  • సోమవారం అర్ధరాత్రి వరకు వేసిన చలాన్స్‌కి వర్తింపు
  • మాస్క్‌ వయోలేషన్​కు 100 చెల్లిస్తే చాలు

హైదరాబాద్‌, వెలుగు: ట్రాఫిక్ చలాన్స్ క్లియరెన్స్‌ కోసం పోలీసులు వాహనదారులకు బంపర్​ఆఫర్స్​​ప్రకటించారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు అన్ని రకాల చాలాన్స్ పై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం రాత్రి వరకు విధించిన చలాన్స్​కు ఈ డిస్కౌంట్స్​వర్తిస్తాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ల తరపడి పెండింగ్​లో ఉన్న ట్రాఫిక్ చలాన్స్‌ క్లోజ్‌ అవుతాయని పోలీసులు భావిస్తున్నారు. లాక్​డౌన్, కొవిడ్​టైంలో మాస్క్​వయోలేషన్​చలాన్స్‌కి కూడా భారీ డిస్కౌంట్‌ ఇచ్చారు. వెయ్యి రూపాయలకు గానూ వంద చెల్లిస్తే చాలని స్పష్టం చేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి డిస్కౌంట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిరకాల వెహికల్స్​పై 6 కోట్ల చాలాన్లు పెండింగ్​లో ఉండగా వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.35 సర్వీస్‌ చార్జీతో కలిపి దాదాపు రూ.1,550 కోట్లు రావాల్సి ఉంది. కాగా ఫైన్లు ప్రతిఒక్కరూ ఆన్​లైన్లోనే చెల్లించాల్సి ఉంది. ఈ–చలాన్‌ వెబ్‌సైట్‌,ఆన్‌లైన్ పేమెంట్‌ గేట్‌వేస్‌ ద్వారా ఫైన్లు కట్టొచ్చు. పోలీసులు ఏప్రిల్‌ నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయనున్నారు. 

ఉపయోగించుకోండి
కరోనా నేపథ్యంలోనే ఈ ఆఫర్‌‌ ఇచ్చాం. మార్చి 31 వరకు డిస్కౌంట్​ పొందొచ్చు. ఈ–చలాన్‌ సైట్‌, గూగుల్‌ పే, పేటీఎం ఇలాంటి పేమెంట్‌ గేట్‌ వేస్​ ద్వారా చలాన్ అమౌంట్‌ క్లియర్ చేసుకోవచ్చు. అందరూ ఈ ఆఫర్​ను వినియోగించుకోవాలి. ఏప్రిల్‌ 1 నుంచి స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తాం. పెండింగ్‌ చలాన్లతో పట్టుబడే వారిపై చర్యలు ఉంటాయి. 
– సీవీ ఆనంద్‌, సీపీ, హైదరాబాద్‌