పాక్ చేతికి అమెరికా అడ్వాన్స్ మిస్సైళ్లు.. మళ్లీ యుద్ధ బీరాలు పోతున్న దాయాది..

పాక్ చేతికి అమెరికా అడ్వాన్స్ మిస్సైళ్లు.. మళ్లీ యుద్ధ బీరాలు పోతున్న దాయాది..

ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్ ఇండియా మధ్య సంబంధాలు బీటలు వారగా.. పాకిస్థాన్ లాభపడుతోంది. ట్రంప్ చెప్పిన మాటలు నోరుమూసుకుని వినే పాక్ చేతికి సరికొత్త ఆయుధాలు ఇవ్వటం ద్వారా రక్షణ వ్యాపారం పెంచుకునేందుకు అమెరికా సన్నద్దమైంది. ఈ క్రమంలోనే 2019లో భారత మిగ్21 జెట్ ను కూల్చేసిన అమ్రాన్ మిస్సైళ్లను దాయాదికి అందించటానికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

దీంతో 2030 నాటికి అమెరికా దశలవారీగా తన అడ్వాన్స్డ్ ఎయిర్ టూ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ AIM-120D-3ని పాక్ కి అందించనుంది. దీనికి సంబంధించి అమెరికా పాక్ మధ్య కుదురిన ఒప్పందం గురించి వాషింగ్ టన్ కీలక ప్రకటన విడుదల చేసింది. AIM-120D-3 అనేది AMRAAM క్షిపణి వ్యవస్థల్లో కొత్త వేరియెంట్. ఇవి ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న అమెరికాకు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాల పోరాట రేంజ్ పెంచుతాయని చెబుతున్నారు. 

చాలా కాలంగా ఈ మిస్సైళ్ వ్యవస్థను పొందటం కోసం పాక్ అమెరికాకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. ప్రస్తుతం భారత్ తన ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, యుద్ధ సన్నద్ధతను పాక్ ఆపరేషన్ సిందూర్ సమయంలో చూడి షాకైన నేపథ్యంలో తాజా డీల్ జరిగింది. జూలై 2025లో పాకిస్తాన్ వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ వాషింగ్టన్‌లో సీనియర్ అమెరికా సైనిక, రాజకీయ నాయకులను కలిసిన తర్వాత డీల్ ముందుకు సాగింది. 

మరో సారి యుద్ధం అంటూ పాక్ బీరాలు.. 

ఇదే క్రమంలో ఇండియాతో తాము శాంతి కోరుకుంటున్నామంటూనే మరో యుద్ధానికి సిద్ధం అంటూ తాజా ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు పాక్ లోని తీవ్రవాదులు కూడా మరో పహల్గామ్ లాంటి దాడి కావాలంటూ అక్కడి ఆర్మీకి బహిరంగంగా డిమాండ్స్ చేయటం, ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నాలు పాక్ కి అస్సలు బుద్దిరాలేదని నిరూపిస్తున్నాయి. భారత్ కూడా పాక్ ఈసారి లైన్ దాటితే ప్రపంచ పఠం నుంచే కనుమరుగవ్వటం కాయం అంటూ తీవ్రంగా స్పందించటం మనం చూశాం.