మోదీ ఫోన్ చేయనందుకే..ట్రంప్ ఈగో హర్ట్

మోదీ ఫోన్ చేయనందుకే..ట్రంప్ ఈగో హర్ట్
  • అందుకే ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోలే: హొవార్డ్ లుట్నిక్ 
  • ట్రేడ్ డీల్ సిద్ధంగా ఉంది.. 
  • మూడు వారాల గడువిచ్చాం
  • కానీ మోదీ ఫోన్ చేయనందుకే టారిఫ్​లు పెంపు: అమెరికా మంత్రి 
  • లుట్నిక్ వ్యాఖ్యల్లో స్పష్టత లేదన్న విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయనందుకే ఆయన ఈగో హర్ట్ అయి, ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదని యూఎస్ కామర్స్ మినిస్టర్ హొవార్డ్ లుట్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో ట్రేడ్ డీల్ అంతా సిద్ధమైనప్పటికీ, మోదీ ఫోన్ చేయకపోవడంతో ట్రంప్ టారిఫ్​లు పెంచారన్నారు.

తాజాగా వ్యాపారవేత్త చమత్ పాలిహపీతియా నిర్వహించిన ‘ఆల్ ఇన్’ పాడ్ కాస్ట్ లో లుట్నిక్ మాట్లాడారు. ‘‘ఇండియాతో ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి ట్రేడ్ పాలసీలపై భేదాభిప్రాయాలు కారణం కాదు. కేవలం ట్రంప్ ఈగోను హర్ట్ చేయడమే కారణం. దీని ఫలితంగా ఇండియా ఇప్పటికే 50% టారిఫ్​లతో మూల్యం చెల్లించుకుంది. ఇండియా స్పందించకపోవడంతో ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో ఒప్పందాలు కుదిరాయి” అని లుట్నిక్ తెలిపారు. అయినప్పటికీ, ఇండియాకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని, చర్చలకు రావచ్చన్నారు. 

ట్రంప్ కాల్స్​ను తిరస్కరించిన మోదీ

ట్రంప్​కు మోదీ ఎప్పుడు ఫోన్ కాల్ చేయాల్సి ఉందన్న విషయాన్ని లుట్నిక్  వెల్లడించలేదు. న్యూయార్క్ టైమ్స్, ఓ జర్మన్ న్యూస్ పేపర్ కథనాల ప్రకారం.. గత ఏడాది జులైలో మోదీకి ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేసినా.. మాట్లాడేందుకు మోదీ తిరస్కరించారని తెలుస్తోంది.

లుట్నిక్ వ్యాఖ్యలు అవాస్తవం: కేంద్రం 

ట్రంప్​కు మోదీ ఫోన్ చేయనందుకే ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదంటూ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని భారత్ స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ..  గత ఏడాది మోదీ, ట్రంప్ 8 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని వెల్లడించారు.

కౌగిలింతలు ఇక ముగిసినయ్: కాంగ్రెస్ 

ట్రంప్ కు మోదీ ఫోన్ చేయనందుకే ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదని లుట్నిక్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ట్రంప్ తో మోదీ దోస్తీ ఇక ముగిసిందంటూ కాంగ్రెస్ జరల్ సెక్రటరీ జైరాం రమేశ్ కామెంట్ చేశారు.

గ్రీన్​లాండ్ వాసులకు డబ్బులతో ట్రంప్​ ఎర!

ఉత్తర ధ్రువంలోని గ్రీన్​లాండ్ ను విలీనం చేసుకునేందుకు గాను అక్కడి ప్రజలకు భారీ ఎత్తున డబ్బులు పంచి వలలో వేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. గ్రీన్ లాండ్​లో 57 వేల మంది జనాభా ఉండగా.. ఒక్కొక్కరికి 10 వేల డాలర్ల (రూ. 9 లక్షలు) నుంచి లక్ష డాలర్ల (రూ. 90 లక్షలు) వరకూ చెల్లించేందుకు ఆయన సర్కారు సిద్ధమైందని మీడియాలో కథనాలు వచ్చాయి. దాదాపు 600 కోట్ల డాలర్లు నేరుగా చెల్లించడం ద్వారా గ్రీన్​లాండ్​ను విలీనం చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని తెలుస్తోంది.