అమెరికా వీసా రూల్స్​తో ఇండియాలో జాబ్స్

అమెరికా వీసా రూల్స్​తో ఇండియాలో జాబ్స్

పుణెహెచ్‌– 1 బీ వీసాలపై అమెరికా పాలకులు పరిమితులు పెట్టడంతో హైటెక్‌ ఉద్యోగాలన్నీ ఇండియా, చైనా, కెనడా దేశాలకు వెళ్లిపోతున్నట్లు తాజాగా ఒక అధ్యయనం తేల్చింది. తగిన నైపుణ్యం ఉన్న వ్యక్తులను రిక్రూట్‌ చేసుకునే అవకాశం లేకుండా హెచ్–1 బీ వీసా పరిమితులు అడ్డుపడుతుండటంతో ఎంఎన్‌సీలు ఆ ఉద్యోగాలను ఇతర దేశాలకు మళ్లిస్తున్నాయని పేర్కొంది. రిజెక్ట్‌ అవుతున్న ప్రతి మూడు వీసా అప్లికేషన్స్‌ కనీసం ఒక జాబ్‌ను విదేశాలకు తరలిస్తున్నట్లు వెల్లడించింది. గత పదిహేనేళ్లుగా ఇది సాగుతోందని తెలిపింది. ముఖ్యంగా హైటెక్నాలజీ రంగాలలో నిపుణుల కోసం ఎంఎన్‌సీలు ఈ జాబ్స్‌ తరలింపును అవలంబిస్తున్నట్లు వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బ్రిటా గ్లెనాన్‌ తన అధ్యయనం తేల్చారు.

2004 నుంచి హెచ్‌–1 బీ వీసాల డేటాను గ్లెనాన్‌ అధ్యయనం చేశారు. ఆ ఏడాది నుంచే ఈ వీసాల సంఖ్యను 65 వేలకు అమెరికా పరిమితం చేసింది. 2016లో ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. యూఎస్‌ ఇచ్చే హై టెక్నాలజీ వర్క్‌ పర్మిట్లలో 70 శాతాన్ని భారత జాతీయులే పొందుతున్నారు. నిపుణుల వలసను అడ్డుకోవడంతో ఉద్యోగాలే విదేశాలకు తరలిపోతున్నాయని, వారికి అవసరమైన నైపుణ్యంతో వ్యక్తులు అమెరికాలో దొరక్కపోవడమే దీనికి కారణమని గ్లెనాన్‌ చెబుతున్నారు. అంతేకాదు, విదేశాలలో మరిన్ని ఆఫీసులనూ ఆ ఎంఎన్‌సీలు తెరుస్తున్నాయని పేర్కొన్నారు.

రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతోందని, ఆ విభాగంలోని పరిశ్రమలే ఎక్కువగా ఉద్యోగాలను తరలిస్తున్నాయని గ్లెనాన్‌ అభిప్రాయపడ్డారు. ఇండియా మొత్తం ఐటీ ఎగుమతులు 9.64 లక్షల కోట్లు ( 136 బిలియన్‌ డాలర్ల)లో మూడో వంతు ఎంఎన్‌సీల గ్లోబల్‌ ఇన్‌–హౌస్‌ సెంటర్ల ద్వారా వస్తోందని నాస్కామ్‌ డేటా చెబుతోంది. ఈ ఎంఎన్‌సీలు తమ గ్లోబల్‌ ఇన్‌–హౌస్‌ సెంటర్ల (జీఐసీ)లో ఉద్యోగుల సంఖ్యను గత నాలుగేళ్లలో విపరీతంగా పెంచినట్లు డేటా వెల్లడిస్తోంది. ఎంఎన్‌సీల జీఐసీలలో 2015లో 7.45 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2019 నాటికి పది లక్షలకు చేరిందని నాస్కామ్‌–జినోవ్‌ అధ్యయనం తేల్చింది.  అంతేకాదు ఇండియాలో జీఐసీల సంఖ్య కూడా 2015 లోని 1,000 నుంచి 2019 నాటికి 1,250 చేరిందని పేర్కొంది. ఫలితంగా మార్కెట్‌ సైజూ 28.03 బిలియన్‌ డాలర్లకు పెరిగనట్లు తెలిపింది.

కొత్త ప్రొడక్ట్స్‌ రూపకల్పనకు ఇనొవేషన్‌ లక్ష్యంగా పనిచేయాలని, తద్వారా పోటీలో ముందు నిలవాలని  కంపెనీలు  ప్రయత్నిస్తున్నట్లు జినోవ్‌ డైరెక్టర్ సుకన్య రాయ్‌ తెలిపారు. వీసాలపై పరిమితుల వల్ల పెద్ద టీంల కదలిక కష్టతరమవుతోందని, ఫలితంగా ఆఫ్‌షోర్‌ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఎంఎన్‌సీలు తమ అవసరాలను నెరవేర్చుకుంటున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగుల నైపుణ్యం పెంచేందుకు, వారిని కాపాడుకోవడానికీ ఎంఎన్‌సీలకు ఇది అనువుగా ఉందని చెప్పారు.

వీసాలపై ట్రంప్ మరింత కఠినం

హెచ్‌‌ –1 బీ వీసాలపై ఆంక్షలకు కఠినమవడంతో, ఇప్పటిదాకా ఆఫ్‌‌షోర్‌‌కు వెళ్లని కంపెనీలు కూడా ఇప్పుడు అందుకు ప్రయత్నిస్తున్నాయని కిందటి వారం ఒక ఇంటర్వ్యూలో గ్లెనాన్‌‌ తెలిపారు. ప్రస్తుత పాలనలో హెచ్‌‌ –1 బీల పరిమితులు మరింత కఠినమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.  హెచ్‌‌ –1 బీ వీసాలపై ఆంక్షలను ట్రంప్‌‌ ప్రభుత్వం మరింత కఠినం చేసింది. అమెరికా యూనివర్శిటీలలో ఎంఎస్‌‌ చేసిన వారికి వర్క్‌‌ వీసాల విషయంలో గతంలో ఉన్న వెసులుబాటు నిబంధనలనూ తాజాగా మార్చేశారు. ఇండియా నుంచి ఎక్కువగా సాఫ్ట్‌‌వేర్‌‌ సర్వీసెస్‌‌ ఎగుమతులు నిర్వహించే నాలుగు కంపెనీలు…టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్‌‌, హెచ్‌‌సీఎల్‌‌ టెక్నాలజీస్‌‌, విప్రోలు గత ఏడాది కాలంలో దరఖాస్తు చేసుకున్న  వర్క్‌‌ వీసాలలో సగానికి సగం తిరస్కరణకు గురయ్యాయి. అమెరికా వర్కర్లకు మరిన్ని ఉద్యోగాలు, అధిక వేతనాలు కల్పించే లక్ష్యంతో ట్రంప్‌‌ అనుసరిస్తున్న విధానాలే దానికి కారణంగా నిలుస్తున్నాయని నేషనల్‌‌ ఫౌండేషన్‌‌ ఫర్‌‌ అమెరికన్‌‌ పాలసీ (ఎన్‌‌ఎఫ్‌‌ఏపీ) చెబుతోంది.