వేలమంది ఇళ్లల్లో చిక్కుకుపోయారు

వేలమంది ఇళ్లల్లో చిక్కుకుపోయారు

అమెరికాలో హరికేన్ ఇయాన్ బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడా తీరాన్ని తాకడంతో.... కుండపోత వర్షాలు, భారీగా వీస్తున్న గాలులు అట్లాంటిక్ తీర ప్రాంతాన్ని నాశనం చేశాయి. ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అట్లాంటిక్  తీరప్రాంతం పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొన్నిచోట్ల దాదాపు 10 అడుగుల మేర నీరు నిలిచింది. చుట్టూ నీరుండడంతో వేలమంది ప్రజలు ఇళ్లలో చిక్కుకుపోయారు. డెల్టోనాలో కాలువలో పడి 72 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

వాననీటిలో ఇళ్లు తేలియాడుతున్న విజువల్స్, వీధుల్లోకి షార్క్ లు కొట్టుకొని వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి. హరికేన్ ధాటికి తీర ప్రాంతంలోని పడవలు ఒడ్డుకు కొట్టుకొచ్చి ధ్వంసమయ్యాయి. సమీప విమానాశ్రయాల్లోని విమానాలు, హెలికాప్టర్లు నాశనమయ్యాయి. విద్యుత్  వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లడంతో పలు ప్రాంతాల్లో పవర్ సప్లైకి అంతరాయం ఏర్పడింది. సుమారు 25 లక్షల మందికి విద్యుత్  సరఫరా నిలిచిపోయింది. 20 మందితో కూడిన వలసదారుల పడవ ఒకటి మునిగిపోయిందని తెలిపారు US బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు. అయితే, వారిలో కొందరిని రక్షించినట్లు చెప్పారు. సానిబెల్ వంతెన కూలిపోవడంతో 6,300 మంది రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

అమెరికాలో నమోదైన పవర్ ఫుల్ హరికేన్లలో ఇయన్ ఒకటని అధికారులు తెలిపారు. సహాయ, రక్షణ చర్యలు చేపట్టినట్లు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ అధికారి డియెనే క్రిస్ వెల్ తెలిపారు. నైరుతి ఫ్లోరిడా సమీపంలోని దీవుల్లో అమెరికా తీర రక్షణ దళం సహాయక చర్యలు చేపట్టింది. ఫోర్ట్  మైయర్  ప్రాంతంలోని వందలాది హాస్పిటల్స్ లో వాటర్ సప్లై నిలిచిపోయింది. దీంతో అక్కడి రోగులను ఇతర హాస్పిటళ్లకు తరలించారు.