తెల్లోడి తెలుగుకు తెల్లబోవాల్సిందే

తెల్లోడి తెలుగుకు తెల్లబోవాల్సిందే

అమెరికాలోని మోంటానా రాష్ట్రం. ఆ స్టేట్ లో ఓ ఐస్ క్రీం  షాపు. కొందరు తెలుగు వాళ్లు వెళ్లారు. షాప్ లో ఉన్న ఓ తెల్లబ్బాయి ‘చెప్పండి.. ఏం కావాలి?’ అని అడిగాడు. ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటే ‘తెలుగులో చెప్పండి’ అన్నాడు. వాళ్లున్నంత సేపు తెలుగులోనే దడదడలాడించాడు. అతనలా తెలుగు ఫటాఫట్ మాట్లాడుతుంటే మనోళ్లు ఆశ్చర్యపోయారు. అతని పేరు ఇసార్ రిచర్డ్స్. అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలో ఉంటాడు. మోంటానాలో ఐస్ క్రీ స్టోర్ నడుపుతున్నాడు. ఆ అమెరికా అబ్బాయికి మరి తెలుగెలా వచ్చిందనుకుంటున్నారు? గతంలో (2016 నుంచి 2018 మధ్య) రెండేళ్లు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ లలో ఉన్నాడట. రెండేళ్లలోనే తెలుగును నేర్చేసుకున్నాడట. అతను తెలుగు మాట్లాడుతున్న ఓ వీడియోను మనోళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ఏపీ, తెలంగాణ ప్రజలు ఎలాగున్నారు?’ అని వీడియో ద్వారా రిచర్డ్స్ అడిగాడు.

తను చేస్తున్న పనిని వివరించాడు. చాలా మంది టూరిస్టులు తన ఐస్ క్రీం  షాప్ కు వస్తుంటారని చెప్పాడు. తాను తెలుగులో మాట్లాడుతుంటే కస్టమర్లు ఆశ్చర్యంగా చూస్తుంటారని అన్నాడు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ తన గుండెల్లో ఉందని చెప్పాడు. వీడియో వైరలవడం, తన గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఇసాక్ మరో వీడియో పోస్ట్ చేశాడు. ‘నా వీడియో ఇంతలా వైరల్ అవుతుందనుకోలేదు. నేను తెలుగు మాట్లాడుతుంటే తెలుగు ప్రజలు ఇంతలా ఆనందపడతారని అనుకోలేదు. నాది న్యూజిలాండ్ అని కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. కాదు. నేను అమెరికన్’ అని చెప్పాడు.