ఇమ్మిగ్రేషన్ బ్యాన్ 60 రోజులే

ఇమ్మిగ్రేషన్ బ్యాన్ 60 రోజులే
  • పొడిగించాలా.. వద్దా అనేది పరిశీలిస్తాం
  • క్లారిటీ ఇచ్చిన ట్రంప్

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగాల కోసం వచ్చే విదేశీయులను రానివ్వబోమని ప్రకటించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ బ్యాన్ పై క్లారిటీ ఇచ్చారు. 60 రోజుల పాటు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ గడువును పొడిగించాలా.. వద్దా అనేది పరిశీలిస్తామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకున్న తర్వాత అమెరికా లోకల్స్ కే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ‘‘ఈ నిషేధం 60 రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి పొడిగించాలా.. వద్దా అనేది డిసైడ్ చేస్తాం. ఇమ్మిగ్రేషన్ బ్యాన్ ను ఎత్తివేసిన తర్వాత అమెరికా సిటిజన్స్ కు ఫస్టు ప్రయారిటీ ఇవ్వడమే మా టార్గెట్. కరోనా ఎఫెక్టుతో ఇక్కడి చాలా మంది పౌరులు ఉపాధి కోల్పోయారు. వారందరినీ కాపాడుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అమెరికాలో వలసలను టెంపరరీగా నిలిపివేస్తున్నాం” అని ట్రంప్ చెప్పారు.

కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్ ఫెయిల్
కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యారని, దాని నుంచి జనాల దృష్టి మళ్లించడానికి ఇమ్మిగ్రేషన్ బ్యాన్ ముందుకు తెచ్చారని టెక్సాస్ లా మేకర్ జాక్విన్ కాస్ట్రో ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం, ట్రంప్ తన వలస వ్యతిరేక ఎజెండాను ముందుకు తేవడం కోసమే ఇలా చేస్తున్నారని ట్వీట్​లో క్యాస్ట్రో ఆరోపించారు.

మనోళ్లకే ఎక్కువ నష్టం
ట్రంప్ నిర్ణయంతో ఇతర దేశీయులు ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లే అవకాశం కోల్పోతారు. దీని ప్రభావం మన దేశీయులపై ఎక్కువగా పడనుంది. అమెరికాలో కరోనాతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దాన్ని అరికట్టేందుకు కొద్ది రోజులుగా విధించిన షట్‌డౌన్‌ కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇబ్బందులో పడటంతో చాలా మంది ఉపాధి ప్రశ్నార్థకమైంది. ఇప్పటి వరకు దాదాపు 2.2కోట్ల మంది నిరుద్యోగ భృతికి అప్లై చేసుకున్నారని, ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెప్తున్నారు.