క్విజ్​లో మొనగాడు.. లక్ష డాలర్లు గెలిచిన ఇండియన్​

క్విజ్​లో మొనగాడు.. లక్ష డాలర్లు గెలిచిన ఇండియన్​

న్యూయార్క్​: ఇండియన్​ అమెరికన్​ స్టూడెంట్​ అమెరికా ప్రతిష్టాత్మక క్విజ్​లో గెలిచాడు. లక్ష డాలర్లు (సుమారు ₹69 లక్షలు) సొంతం చేసుకున్నాడు. అమెరికాలో ఎక్కువ మంది చూసిన క్విజ్​ షో ‘2019 టీన్​ జియోపార్డీ’ క్విజ్​లో ఇండియాకు చెందిన అవి గుప్తా విన్నర్​గా నిలిచాడు. ఒరెగాన్​లోని పోర్ట్​లాండ్​ స్కూల్​లో చదువుతున్న అతడు ‘టీన్​ టోర్నమెంట్​’ను గెలిచాడని క్విజ్​ను నిర్వహించిన జియోపార్డీ ప్రకటించింది. గెలిచానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు, పోటీలో గెలిచినందుకు మాటలు కూడా రావట్లేదన్నాడు.

‘‘జియోపార్డీ నా జీవితంలో భాగం. మా కుటుంబంలో భాగం. మా నాన్నమ్మకు ఆ కార్యక్రమమంటే పిచ్చి” అని చెప్పాడు. తల్లిగా అతడు పోటీలో ఉన్నప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందని అతడి తల్లి నందితా గుప్తా చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా ఉండడమే అవికి పెద్ద బలమని చెప్పారు. కాగా, సియాక్స్​ఫాల్స్​కు చెందిన రయాన్​ ప్రెస్లర్​ అనే స్టూడెంట్​ రెండో స్థానంలో నిలిచి 50 వేల డాలర్ల (రూ.34.47 లక్షలు) రన్నరప్​ ప్రైజ్​ను అందుకున్నాడు. మయామికి చెందిన లూకస్​ మైనర్​ అనే అబ్బాయి మూడో స్థానంలో నిలిచాడు. 25 వేల డాలర్లు (రూ.7.23 లక్షలు) గెలుచుకున్నాడు.