ఇరాన్ సిటీలపై అమెరికా మిసైల్ దాడి..వేగంగా ప్రతిస్పందించిన ఇరాన్.. కువైట్పై డ్రోన్లు, మిసైళ్లతో అటాక్!

ఇరాన్ సిటీలపై అమెరికా మిసైల్ దాడి..వేగంగా ప్రతిస్పందించిన ఇరాన్.. కువైట్పై డ్రోన్లు, మిసైళ్లతో అటాక్!

దుబాయ్/ వాషింగ్టన్/ టెహ్రాన్: ఇరాన్ ఓడరేవు పట్టణం బందర్ అబ్బాస్ పై అమెరికా సైనిక బలగాలు డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడ్డాయి. సోమవారం ఉదయం అమెరికా బలగాలు దాడి చేశాయి. రాజధాని టెహ్రాన్ లోనూ భారీ ఎత్తున పేలుళ్లు జరిగినట్లు సమాచారం. తమ డ్రోన్ (ఎంక్యూ–1 ప్రిడేటర్) ను కూల్చివేతకు ప్రతీకారంగానే దాడులు చేపట్టినట్లు అమెరికా మిలిటరీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. బందర్ అబ్బాస్ లోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, ఇరాన్ రాడార్, డ్రోన్ కంట్రోల్ సెంటర్ ను దెబ్బతీశామని పేర్కొంది. శని, ఆదివారాల్లో గెరుక్ సిటీతో పాటు ఖేష్మ్  ఐలాండ్ పై మిసైల్ దాడులు చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ వివరించింది. 

హార్మూజ్ జలసంధి సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న ఎంక్యూ– 1 ప్రిడేటర్ డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసిందని, అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న తమ డ్రోన్ పై రూల్స్ కు విరుద్ధంగా కాల్పులు జరిపిందని ఆరోపించింది. ఇరాన్ దుందుడుకు చర్యలకు ధీటుగా జవాబిచ్చేందుకు తాము ప్రతీకార దాడులు చేశామని స్పష్టం చేసింది. సిరిక్ ఐలాండ్​లోని అమెరికా టెలికమ్యూనికేషన్ టవర్‌‌‌‌‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్ తెలిపింది. మరోవైపు, అమెరికా దాడులకు ఇరాన్ కూడా వెంటనే రియాక్ట్ అయింది. గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేపట్టామని పేర్కొంది. 

అయితే, ఏ దేశంలోని అమెరికా బేస్ లపై దాడులు చేశామనేది ఇరాన్ నిర్దిష్టంగా చెప్పలేదు. కాగా, తమ భూభాగంపైకి దూసుకొచ్చిన ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సాయంతో అడ్డుకున్నామని కువైట్ పేర్కొంది. దీంతో ఇరాన్  దాడులు చేసింది కువైట్ భూభాగంపైనేనని తేలింది. ఈ క్రమంలోనే ఇరాన్ దాడులను కువైట్ ఖండించింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం ఏర్పరిచేందుకు వీలుగా, కాల్పుల విరమణ పొడిగింపునకు సంబంధించి అమెరికా, ఇరాన్ ల మధ్య ఓవైపు చర్చలు జరుగుతుండగానే ఈ పరస్పర దాడులు జరగడం గమనార్హం. హార్మూజ్ జలసంధి సమీపంలోనే ఈ దాడులు జరిగాయి. ఈ దాడులతో హార్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

అమెరికాతో అణు చర్చల్లేవ్

ఇరాన్ అణు నిల్వలకు సంబంధించి అమెరికాతో ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ దేశ అణు విధానంపై ఎప్పుడు ఎలా స్పందించాలో తమకు తెలుసని వివరించింది. అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చల్లో ఇప్పటివరకు అణు కార్యక్రమాల ప్రస్తావన రాలేదని, ప్రస్తుతానికి తమ ప్రాధాన్యం మొత్తం యుద్ధం ఆపడమేనని స్పష్టం చేసింది.