అమెరికాలో భారతీయులకు ఊరట.. గ్రీన్ కార్డ్ కొత్త రూల్స్ లో పాక్షిక సడలింపు ..దరఖాస్తుదారుల్లో కొందరికి మినహాయింపు

అమెరికాలో భారతీయులకు ఊరట..  గ్రీన్  కార్డ్ కొత్త రూల్స్ లో  పాక్షిక సడలింపు ..దరఖాస్తుదారుల్లో కొందరికి మినహాయింపు
  • రూల్స్ సడలింపుతో భారతీయులకు కొంచెం ఉపశమనం 

వాషింగ్టన్: కొత్తగా ప్రకటించిన గ్రీన్​కార్డ్ నిబంధనలను అమెరికా పాక్షికంగా సడలించింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటున్న విదేశీయులు గ్రీన్​కార్డు కావాలంటే.. సొంత దేశాలకు తిరిగి వెళ్లి, అక్కడి యూఎస్ ఎంబసీల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలంటూ యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్ సీఐఎస్) శుక్రవారం కొత్త రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ పై అమెరికాలో ఉంటున్న విదేశీ నిపుణులు, ప్రధానంగా ఇండియన్ టెకీల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో దేశానికి ప్రయోజనకరం అనుకునే వారికి మాత్రం మినహాయింపు ఇస్తామని యూఎస్ సీఐఎస్ శనివారం ప్రకటించింది. 

ఇమిగ్రేషన్ పాలసీలో ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ ప్రకారం..  వర్క్, స్టూడెంట్, టూరిస్ట్ వీసాలపై ఉన్న దరఖాస్తుదారులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి, యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారా గ్రీన్​కార్డ్ (పర్మనెంట్ రెసిడెన్స్ కార్డ్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంతకుముందు ఉన్న రూల్స్ ప్రకారం, అర్హులైన చాలా మంది దరఖాస్తుదారులు 'అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ స్టేటస్' ప్రక్రియ ద్వారా అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే, కొత్త నిబంధనలపై వచ్చిన విమర్శలు, గందరగోళం తర్వాత, యూఎస్ సీఐఎస్ రెండు కీలక మినహాయింపులను ప్రవేశపెట్టింది. 

విదేశీ ఉద్యోగుల్లో ఎవరితోనైతే అమెరికాకు ఆర్థిక, జాతీయ ప్రయోజనాలు ఉంటాయని ధ్రువీకరణకు వస్తే.. వారికి మాత్రం ఈ కొత్త రూల్స్ నుంచి మినహాయింపు ఉంటుందని, వారు అమెరికాలో ఉంటూనే గ్రీన్​కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యూఎస్ సీఐఎస్ అధికార ప్రతినిధి జాక్ కహ్లర్ వెల్లడించారు. ‘‘ఈ మినహాయింపు కింద గ్రీన్​కార్డుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించి, వారితో దేశానికి ఆర్థిక, జాతీయ ప్రయోజనాలు ఉన్నాయా? లేదా? అన్నది నిర్ణయిస్తాం. ఆమోదం పొందితే, వారు దేశంలోనే ఉండి గ్రీన్​కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే వారు కూడా సొంత దేశాలకు వెళ్లాల్సిందే” అని పేర్కొన్నారు.