నైస్ బీబీ.. నువ్వు గొప్ప పనిచేశావు!..నెతన్యాహుకు ట్రంప్ మెచ్చుకోలు

నైస్ బీబీ.. నువ్వు గొప్ప పనిచేశావు!..నెతన్యాహుకు ట్రంప్ మెచ్చుకోలు
  • ఇజ్రాయెల్ పార్లమెంట్​లో నెతన్యాహుకు ట్రంప్ మెచ్చుకోలు
  • ట్రంప్​ను స్టాండింగ్ ఒవేషన్​తో స్వాగతించిన సభ్యులు

టెల్ అవీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ప్రశంసలతో ముంచెత్తారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత సోమవారం ట్రంప్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ట్రంప్ కు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం పలికారు. అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ట్రంప్​ప్రసంగించారు. 

"బీబీ (నెతన్యాహు ముద్దుపేరు).. నువ్విప్పుడు యుద్ధంలో లేవు, ప్రశాంతంగా ఉండొచ్చు" అని అన్నారు. హమాస్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంపై నెతన్యాహుతో పాటు తనను తాను ట్రంప్ ప్రశంసించుకున్నారు. ‘‘ఎన్నో సంవత్సరాల అవిశ్రాంత యుద్ధం, అంతులేని ప్రాణనష్టం తర్వాత ఈ రోజు ఆకాశం ప్రశాంతంగా ఉంది. తుపాకులు నిశ్శబ్దంగా ఉన్నాయి. సైరన్లు స్తబ్దుగా ఉన్నాయి. 

సూర్యుడు ఒక పవిత్ర భూమిపై ఉదయిస్తున్నాడు. దేవుడు ఇష్టపడితే ఈ భూమి శాశ్వతంగా శాంతిలో జీవిస్తుంది" అని పేర్కొన్నారు. "ఇది కేవలం యుద్ధం ముగింపు మాత్రమే కాదు. కొత్త మధ్యప్రాచ్యానికి చారిత్రక ఆరంభం" అని అన్నారు. 

"బందీలు తిరిగి వచ్చారని చెప్పడానికి చాలా గొప్పగా ఉంది" అని చెప్పారు. తాను యుద్ధాలను ఆపేందుకే ఉన్నానని చెప్పారు. ఇప్పటివరకు 8 యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు. తాను క్రూరంగా ఉంటానని అంతా అనుకుంటారు. కానీ తనది యుద్ధాలను ఆపే  వ్యక్తిత్వమని ట్రంప్ పేర్కొన్నారు.

మరింత మంది ట్రంప్​లు అవసరం..

ఇజ్రాయెల్ పార్లమెంట్​లో సభ్యులు ట్రంప్​కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రెండున్నర నిమిషాల పాటు చప్పట్లు కొట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ అమీర్​ ఓహానా మాట్లాడుతూ.. యూదుల చరిత్రలో ట్రంప్ ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోతారని అన్నారు. ‘‘ప్రస్తుతం ప్రపంచానికి ట్రంప్​ లాంటి వారు అవసరం. ధైర్యవంతులు, సమగ్ర నిర్ణయాలు తీసుకునేవారు కావాలి. 

ప్రపంచానికి మరింత మంది ట్రంప్​లు అవసరం’’ అని ఓహానా పేర్కొన్నారు. అలాగే, వచ్చే ఏడాది ట్రంప్​పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ట్రంప్​ ప్రసంగిస్తుండగా.. ఇద్దరు ఎంపీలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. "పాలస్తీనాను గుర్తించండి" అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని బయటకు తీసుకెళ్లారు. 

ఈ ఘటనపై ట్రంప్​కు స్పీకర్ ఓహానా సారీ చెప్పారు. దీనికి ట్రంప్ ‘‘మీరు చాలా సమర్థవంతంగా వ్యవహరించారు’’ అంటూ చమత్కరించారు. ట్రంప్ ఆ తర్వాత గాజా శాంతి ఒప్పందాన్ని కుదర్చడంలో సహాయపడిన తన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ అలాగే, అతని అల్లుడు, సలహాదారు జారెడ్ కుష్నర్​ను అభినందించారు.

పాక్, అఫ్గాన్ ఉద్రిక్తతలను పరిష్కరిస్తా..

పాక్​, అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సైతం పరిష్కరిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కొన్ని యుద్ధాలను టారీఫ్​లను బూచిగా చూపి ఆపానని తెలిపారు. 

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో 200 శాతం సుంకాలు విధిస్తానంటూ వారిద్దరినీ బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు డొనాల్డ్ ట్రంప్ ​మరోసారి వ్యాఖ్యానించారు.