ఒమిక్రాన్ ఎఫెక్ట్: అమెరికా కీలక నిర్ణయం

ఒమిక్రాన్ ఎఫెక్ట్: అమెరికా కీలక నిర్ణయం

కరోనా దెబ్బకు విలవిలలాడి ఇప్పుడిప్పుడే తెరిపినపడుతున్న అగ్రరాజ్యం అమెరికా తాజాగా బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపధ్యంలో అమెరికాలో ఎలాంటి కేసులు బయటపడకపోయినా ముందస్తు చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిన వెంటనే దక్షిణాఫ్రికా నుంచి విమాన సర్వీసులను నిషేధించిన అమెరికా.. తాజాగా మరికొన్ని దేశాల నుంచి విమాన సర్వీసులను నిషేధించింది. ఈ మేరకు అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాలతో విదేశీ వ్యవహారాల శాఖ దక్షిణాఫ్రికా తోపాటు జింబాబ్బే, బొట్స్వానా, నమీబియా, మొజాంబిక్, లెసొథొ, మలావిల, ఇస్వాతిని తదితర దక్షిణాఫ్రికా దేశాల నుండి ప్రయాణంపై నిషేధం సోమవారం అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

అయితే అమెరికా పౌరులు స్వదేశానికి తిరిగివచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కాకపోతే విమానం దిగిన వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగటివ్ వస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ పై అమెరికా అధ్యక్షుడు నిర్ణయానికంటే ముందు యూఎస్ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఆదివారం ఒక మీడియాతో మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అమెరికాలో ఇంత వరకు బయటపడకపోయినా.. "ఇది మా సంసిద్ధతను పెంపొందించడానికి మాకు కొంత సమయం ఇవ్వబోతోంది" అని చెప్పారు. డెల్టా వేరియంట్ తర్వాత కొత్తరూపం దాల్చిన ఒమిక్రాన్ మరింత తీవ్రమైన అంటువ్యాధి కావొచ్చని ఆయన పేర్కొన్నారు.