యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కు ..బ్రెజిల్ అధ్యక్షుడు లులా వార్నింగ్

యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కు ..బ్రెజిల్ అధ్యక్షుడు లులా వార్నింగ్

 

  • అమెరికా బెదిరింపులకు భయపడబోమని కామెంట్
  • మేమూ టారిఫ్​లు విధిస్తాం

బ్రసీలియా/న్యూఢిల్లీ: అమెరికా విధించిన 50 శాతం టారిఫ్​ను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా తీవ్రంగా ఖండించారు. ట్రంప్ టారిఫ్‌‌‌‌లకు కౌంటర్​గా సమానమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బ్రెజిల్ స్వతంత్ర దేశమని, తమ దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ దేశ సమస్యలు తామే పరిష్కరించుకుంటామని, మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదని తేల్చి చెప్పారు.

 బ్రెజిల్ స్వతంత్ర సంస్థలు కూడా అమెరికా బెదిరింపులకు భయపడవని స్పష్టం చేశారు. బోల్సోనారో విచారణ అంశం.. బ్రెజిల్ న్యాయవ్యవస్థ చూసుకుంటున్నదని తెలిపారు. ట్రంప్ చేసిన వాణిజ్య లోటు ఆరోపణలను లులా ఖండించారు. గత 15 ఏండ్లలో బ్రెజిల్‌‌‌‌తో అమెరికా లక్షల కోట్ల వ్యాపారం చేసిందని తెలిపారు. 2024లోనే అమెరికాతో బ్రెజిల్ రూ.6.34 లక్షల కోట్ల బిజినెస్ చేసిందన్నారు. టారిఫ్​ల విషయంలో బ్రెజిల్​తో అమెరికా చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.

అమెరికా, భారత్ చర్చలు కొనసాగుతున్నయ్..

అమెరికాతో ట్రేడ్ డీల్ ఫైనల్ చేసేందుకు ఇండియా చర్చలు జరుపుతున్నదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో  సీఐఐ ఎక్స్‌‌‌‌పోర్ట్ లాజిస్టిక్స్ కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు. అమెరికా, ఇండియా ట్రేడ్ డీల్.. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ నాటికి ట్రేడ్ డీల్ ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అగర్వాల్ చెప్పారు. వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం భారత కామర్స్ మినిస్ట్రీ ఆఫీసర్ల టీమ్.. త్వరలోనే అమెరికాకు వెళ్తుందని తెలిపారు.