కోడిని కోయని చికెన్ ఇది.. ఇక అమ్ముకోవటానికి గ్రీన్ సిగ్నల్

కోడిని కోయని చికెన్ ఇది.. ఇక అమ్ముకోవటానికి గ్రీన్ సిగ్నల్

సాధారణంగా చికెన్ తినాలంటే కోడిని కోయాల్సిందే. కానీ ఇప్పటి నుంచి ఆ అవసరం లేదు. కోడిని కోయకుండా కూడా చికెన్ తినొచ్చు. అవును ఇది నిజం. మొట్టమొదటిసారిగా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. మొదట రెస్టారెంట్లలో అమ్మకాలు మొదలు పెట్టి..ఆ తర్వాత  సూపర్ మార్కెట్లలోనూ ఈ చికెన్ ను  అందుబాటులో ఉంచనున్నారు.  

ల్యాబ్ లో చికెన్ ఎలా తయారు చేస్తారంటే..

ల్యాబ్లో కోడి మూలకణాల నుంచి ఈ చికెన్ ను తయారు చేస్తారు. కోడి నుంచి వచ్చే కణాలకు పోషకాలు అందించి.. వెచ్చగా ఉండే ఒక ప్రత్యేక రసాయనంలో ఉంచుతారు. నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత  ఈ కణాలు మాంసంగా మారుతాయి. 

ఏ సంస్థలో చికెన్ తయారీ..

ఈట్ జస్ట్ కంపెనీ గుడ్ మీట్ పేరుతో ల్యాబ్ గ్రోన్ చికెన్ ను మార్కెట్ చేస్తోంది. ఈ సంస్థతోపాటు జోనిన్ బయోలాజిక్స్ కూడా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను విక్రయించనుంది. ప్రస్తుతం ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ అమ్మకాలకు అమెరికా ఎఫ్డీఏ సంస్థ రెండు కంపెనీలకు అనుమతివ్వగా..ప్రపంచంలోనే తొలిసారిగా కాలిఫోర్నియాలోని స్టార్టప్ కంపెనీ ఈట్ జస్ట్  కు సింగపూర్ ప్రభుత్వం గతంలోనే అనుమతిచ్చింది.  సింగపూర్ లో ఇప్పటికే ఈట్ జస్ట్ కంపెనీ తయారు చేసిన చికెన్ ను గుడ్ మీట్ సంస్థ  విక్రయిస్తోంది. 

 
ప్రయోజనాలేంటి..?

ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను అమ్మడం ద్వారా జంతువుల పెంపకం, వాటికి దాణా, వాటి నుంచి వెలువడే వ్యర్థాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మాంసం కోసం జంతువులను వధించాల్సిన అవసరం ఉండదు. ఆహార భద్రత సమస్యలకు ఇదోక ప్రత్యామ్నాయ మార్గం. 

ల్యాబ్ లో తయారైన రొయ్యలు..పంది మాంసం..

శాస్త్రీయ పద్దతిలో మాంసాన్ని తయారు చేస్తున్నది ఈట్ జస్ట్ సంస్థ ఒక్కటే కాదు.  సింగపూర్ కు చెందిన షాప్ మేట్స్ అనే స్టార్టప్ సంస్థ ల్యాబ్ లో రొయ్యలు కూడా పెంచుతోంది. ఈ రొయ్యలతో చేసిన ఒక కుడుము ధర సుమారు అక్కడ 22 వేల రూపాయలు. 202లో  ల్యాడ్ లో తయారు చేసిన బీఫ్ మాంసాన్ని కూడా విక్రయించాలని ఈట్ జస్ట్ సంస్థ ప్లాన్ చేస్తోంది.