వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ఇరాన్‌పై యూఎస్ సీక్రెట్ అటాక్ చేసింది. హోర్ముజ్ జలసంధిలోని అతిపెద్ద ద్వీపమైన ఇరాన్‌కు చెందిన ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దళాలు రహస్యంగా దాడి చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కొన్ని రాడార్ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లు ధ్వంసమయ్యాయి. గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణను ముగించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కీలక దశలో ఉన్నాయి.
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం ఇటీవల వెల్లడించారు. ఈ తరుణంలో ఇరాన్‌పై అమెరికా రహస్యంగా దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై యూఎస్ దాడులు చేయదని ట్రంప్ చెప్పినప్పటికీ సరిగ్గా ఎన్నికలకు ముందు రోజు రాత్రి దాడులు జరగడంతో కథ మళ్లీ మొదటికే వచ్చేలా కనబడుతుందని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ నివేదిక ప్రకారం.. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైన హార్మూజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో వెంటవెంటనే ఐదు పేలుళ్లు వినిపించాయి. ఖేష్మ్ ద్వీపంపై రెండు యుద్ధ విమానాలు కూడా ఎగిరినట్లు స్థానికులు తెలిపారు. ఇరాన్‌పై సైనిక చర్యను పునఃప్రారంభించే ఉద్దేశాన్ని సూచించకుండా కావాలనే అమెరికా ఈ దాడిని రహస్యంగా ఉంచిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
A;LSO READ : అమెరికాలో మధ్యంతర ఎన్నికలు: కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఓటింగ్
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికన్ విమానాలను లక్ష్యంగా చేసుకుని ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను ఉపయోగించడం వల్లే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా అధికారులు వెల్లడించారు. ఇది పూర్తి స్థాయి యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడం కాదని, కేవలం తమ బలగాల రక్షణ కోసం చేపట్టిన పరిమిత ఆత్మరక్షణ చర్య మాత్రమేనని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో ఇరాన్‌పై దాడులు చేయబోమని చెప్పిన ట్రంప్ మాట తప్పడంతో యూఎస్ దాడులపై ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందోనని పశ్చిమాసియా దేశాల్లో ఉత్కంఠ నెలకొంది.
