- బయోమెట్రిక్ ఇస్తేనే క్లియరెన్స్
- గ్రీన్ కార్డ్ హోల్డర్లు, నాన్ సిటిజన్లకు కొత్త రూల్
- డిసెంబర్ 26 నుంచి అమల్లోకి
- వయస్సుతో సంబంధం లేకుండా అందరి డేటా సేకరణ
- వీసా ఓవర్‌స్టేలను తగ్గించేందుకే అంటున్న ట్రంప్ సర్కార్
వాషింగ్టన్: అమెరికాలోని గ్రీన్ కార్డు హోల్డర్లతో పాటు నాన్ సిటిజన్స్ కోసం ట్రంప్ సర్కార్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అమెరికాలో ఎంటర్ అయ్యే ముందు.. అమెరికా వదిలి వెళ్లేటప్పుడు కచ్చితంగా ఫేషియల్ రికగ్నిషన్ ఫొటో తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. అవసరమైతే బయోమెట్రిక్ డేటా కూడా సమర్పించాల్సి ఉంటుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రకటించింది.
ఈ కొత్త నిబంధన డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. సౌత్ బార్డర్ (యూఎస్ – మెక్సికో) భద్రతను బలోపేతం చేయడం, వీసా ఓవర్‌స్టేలను నియంత్రించడం, ఇమ్మిగ్రేషన్ మోసాలను అరికట్టేందుకే ఈ ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ నిబంధన తీసుకొచ్చినట్లు డీహెచ్ఎస్ స్పష్టం చేసింది.
ఇల్లీగల్ మైగ్రెంట్లను ట్రాక్ చేసేందుకు...
బయోమెట్రిక్ ఎంట్రీ, ఎగ్జిట్ సిస్టమ్ ప్రతిపాదన.. 2021లోనే వచ్చినప్పటికీ.. ఇప్పుడు అమలు చేసేందుకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నిర్ణయించింది. యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు.. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులు, భూ సరిహద్దుల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ సమయంలో నాన్ సిటిజన్స్ ఫొటోలు, ఇతర బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తారు.
గతంలో, 14 ఏండ్లలోపు పిల్లలకు, 79 ఏండ్లు పైబడిన వారికి ఈ బయోమెట్రిక్ డేటా సేకరణ నుంచి మినహాయింపు ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఈ ప్రక్రియకు లోబడి ఉండాలి. వీసా గడువు ముగిసినా దేశంలోనే అక్రమంగా ఉంటున్నవారిని ట్రాక్ చేయడానికి, గుర్తించడానికి ఈ ఎంట్రీ, ఎగ్జిట్ సిస్టమ్ ఉపయోగపడుతుందని డీహెచ్ఎస్ పేర్కొన్నది.
రియల్ టైమ్లో డేటా క్రాస్ చెక్
సీబీపీ అధికారులు రియల్ -టైమ్‌లో పాస్‌పోర్ట్, వీసా రికార్డులతో మైగ్రెంట్ను క్రాస్‌చెక్ చేసుకుంటారు. పాస్‌పోర్ట్‌లు, ట్రావెల్ డాక్యుమెంట్‌లలోని ఫొటోలను, సరిహద్దు వద్ద తీసిన ఫొటోలను కలిపి ఒక ఇమేజ్ డేటాబేస్‌ను రూపొందిస్తారు. ఈ ఫొటోలను సరిహద్దుల్లో ఎంట్రీ, ఎగ్జిట్ సమయాల్లో తీసుకునే రియల్-టైమ్ ఫొటోలతో సరిపోల్చి చూస్తారు. బయోమెట్రిక్ ఎంట్రీ, ఎగ్జిట్ వ్యవస్థను అన్ని వాణిజ్య విమానాశ్రయాలు, పోర్టుల్లో పూర్తిగా అమలు చేయడానికి 3 నుంచి ఐదేండ్లు పట్టొచ్చని సీబీపీ అంచనా వేసింది.
కాగా, ఈ నిబంధన గ్రీన్ కార్డ్ హోల్డర్లను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. అమెరికాలో ఎంటర్ అయ్యేటప్పుడే ఫొటోలు, ఫింగర్ ప్రింట్స్ ఇస్తున్నారు. కానీ.. ఎగ్జిట్లోనూ తప్పనిసరి చేయడం కొత్తది. ఇది జర్నీ టైమ్‌ను పెంచే అవకాశం ఉంటుంది.
