గాజాలో కాల్పుల విరమణ తీర్మానానికి అమెరికా వీటో

గాజాలో కాల్పుల విరమణ తీర్మానానికి  అమెరికా వీటో
  • యూఎన్‌‌ఎస్‌‌సీలో తీర్మానాన్ని వ్యతిరేకించిన యూఎస్
  • కౌన్సిల్‌‌లో 13 దేశాలు అనుకూలం..

యునైటెడ్ నేషన్స్: రెండు నెలలుగా సాగుతున్న యుద్ధంతో శిథిలమైన గాజాలో వెంటనే కాల్పులు విరమణ జరగాలంటూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌ (యూఎన్‌‌ఎస్‌‌సీ)లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంది. గాజాలో కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్ గ్రూపు వెంటనే, బేషరతుగా రిలీజ్ చేయాలని కోరుతూ డ్రాఫ్ట్ రిజల్యూషన్‌‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రతిపాదించింది. దీన్ని 90 యూఎన్ సభ్య దేశాలు సపోర్ట్ చేశాయి. యూఎన్‌‌ఎస్‌‌సీలోని 13 దేశాలు ఈ డ్రాఫ్ట్‌‌కు అనుకూలంగా ఓటేయగా.. బ్రిటన్ ఓటింగ్​లో పాల్గొనలేదు.

ఆర్టికల్‌‌ 99ను ప్రయోగించిన గుటెర్రస్

గాజాలో మానవతా సంక్షోభాన్ని నివారించేందుకు, కాల్పుల విరమణ కోసం ఇటీవల యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. యూఎన్‌‌ చార్టర్‌‌లోని ఆర్టికల్‌‌ 99ను ప్రయోగించారు. ఓటింగ్‌‌కు ముందు గుటెర్రెస్ మాట్లాడుతూ.. తక్షణ కాల్పుల విరమణ కోసం, పౌరుల రక్షణ కోసం, ప్రాణాలను రక్షించే సాయాన్ని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కౌన్సిల్‌‌ను కోరారు. 

అందుకే వ్యతిరేకించాం: అమెరికా 

తీర్మానాన్ని వ్యతిరేకించడంపై అమెరికా స్పందించింది. యూఎస్ అంబాసిడర్ రాబర్ట్‌‌ ఉడ్‌‌ మాట్లాడుతూ.. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌‌పై హమాస్ చేసిన భయానక ఉగ్రవాద దాడిని ఎందుకు ఖండించలేదన్నారు. తీర్మానంపై తాము చేసిన సూచనలు పట్టించుకోలేదని విమర్శించారు. మరోవైపు, హమాస్ చర్యల విషయంలో ఎలాంటి ఖండన లేకపోవడంతో తాము ఓటింగ్‌‌కు దూరంగా ఉన్నామని యూఎన్‌‌లో బ్రిటన్ పార్లమెంట్ రిప్రజెంటేటివ్ బార్బరా వుడ్‌‌వర్డ్ చెప్పారు. హమాస్ వద్ద ఇప్పటికీ కొందరు బందీలుగా ఉన్నారని గుర్తుచేశారు.

పాలస్తీనియన్లకు ఏంచెప్తున్నట్లు?: యూఏఈ

తీర్మానం వీగిపోవడంపై యూఏఈ అంబాసిడర్, డిప్యూటీ పర్మినెంట్ రెప్రజెంటేటివ్ మొహమ్మద్ అబుసాహబ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు.. కాల్పుల విరమణ కోసం ఈ కౌన్సిల్ డిమాండ్ చేయలేకపోయిందని అన్నారు. ‘గాజాపై నిరంతరం జరుగుతున్న బాంబుదాడులను ఆపాలన్న పిలుపు వెనుక మనం ఐక్యంగా ఉండలేకపోతే పాలస్తీనియన్లకు మనం ఏం సందేశం పంపుతున్నట్లు?” అని ప్రశ్నించారు.