- అక్టోబర్ 2026 వరకు పోస్ట్ పోన్
- ఆందోళనలో ఇండియన్ స్టూడెంట్లు
న్యూఢిల్లీ: అమెరికా వీసా సంక్షోభం మరింత ముదురుతోంది. యూఎస్ హెచ్ 1బీ, హెచ్4 వీసా ఇంటర్వ్యూలు దేశంలో మళ్లీ వాయిదాపడ్డాయి. 2026 అక్టోబర్ కు అపాయింట్ మెంట్లను పోస్ట్ పోన్ చేశారు. వాస్తవానికి డిసెంబర్, జనవరి మధ్య జరగాల్సిన ఇంటర్వ్యూలను అంతకుముందు కూడా ఫిబ్రవరి, మార్చి 2026కు వాయిదా వేశారు.
ఇప్పుడు 2026 అక్టోబర్ కు పోస్ట్ పోన్ చేయడంతో కొన్ని వేల మంది ఇండియన్ స్టూడెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వీసా ఇంటర్వ్యూల కోసం చాలా మంది స్లాట్లు బుక్ చేసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న వారు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అపాయింట్మెంట్లను వాయిదా వేయడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్లను స్ర్కీనింగ్ చేయడానికి అదనపు ప్రాసెసింగ్ టైమ్ అవసరం కావడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేశామని అమెరికా అధికారులు చెప్పారు. వాస్తవానికి డిసెంబర్, జనవరిలో వీసా ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. అయితే, ఇంటర్వ్యూలను అమెరికా విదేశాంగ శాఖ ఫిబ్రవరి, మార్చ్ నెలకు వాయిదా వేసింది.
దీంతో ఆ నెలల్లో ఇండియాకు వచ్చి, ఇంటర్వ్యూకు హాజరు కావడానికి విదేశాల్లో ఉంటున్న కొన్నివేల మంది ఇండియన్ స్టూడెంట్లు ఇదివరకే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. వారంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. కాగా, వీసా ఇంటర్వ్యూల పొడిగింపు నేపథ్యంలో భారత్ లో అమెరికా ఎంబసీ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో సందర్శకులు ఎంతకాలం ఉండాలన్నది వారి వీసా గడువు తేదీ నిర్ణయించదని, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సందర్శకుల గడువు తేదీని నిర్ధారిస్తారని వెల్లడించింది.
