సింగపూర్, థాయిలాండ్, వియత్నాంలోని ఎంబసీల్లో ఇండియన్లకు చాన్స్

సింగపూర్, థాయిలాండ్, వియత్నాంలోని ఎంబసీల్లో ఇండియన్లకు చాన్స్

న్యూఢిల్లీ: విదేశాల్లోని అమెరికన్ ఎంబసీల్లో కూడా ఇండియన్లు వీసా అపాయింట్మెంట్లు తీసుకుని, అక్కడి నుంచి కూడా ఇకపై ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. మన దేశం నుంచి అమెరికా వెళ్లాలనుకునేవాళ్లకు వీసా అపాయింట్మెంట్లకు ఇంకా 500 రోజులకుపైనే టైం పడుతుండటంతో ఈ వెయిటింగ్ టైంను తగ్గించేందుకు సింగపూర్, థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల్లోని యూఎస్ ఎంబసీల్లోనూ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. కరోనా ఆంక్షలు ఎత్తేసిన తర్వాత మన దేశం నుంచి యూఎస్ వెళ్లాలనుకునే వాళ్లకు వివిధ వీసాలకు వెయిటింగ్ టైం భారీగా పెరిగింది. దీంతో వీసా బ్యాక్ లాగ్​లను తగ్గించేందుకు సిబ్బంది సంఖ్యను పెంచుతున్నామని, గతంలో వీసా తీసుకున్నోళ్లు రెండోసారి అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూ అవసరంలేకుండా ప్రాసెస్​ను మార్చామని ఇదివరకే యూఎస్ ఎంబసీ ప్రకటించింది. అయినా, ఇప్పటికీ ఢిల్లీలోని యూఎస్ ఎంబసీతోపాటు ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా కాన్సులేట్ లలో వీసాలకు కనీసం 500 రోజులకుపైనే వెయిటింగ్ టైం ఉంటోంది. అందుకే అత్యవసరం అయినోళ్లు విదేశాల్లోని యూఎస్ ఎంబసీల నుంచి వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్లు యూఎస్ ఎంబసీ తాజాగా వెల్లడించింది.  

బ్యాంకాక్ లో అయితే 14 రోజులకే.. 

అమెరికా ఇచ్చే బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) వీసాల కోసం ఎదురు చూస్తున్నోళ్లలో ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్లు, నాలుగేండ్ల కిందట వీసాలు ఎక్స్ పైర్ అయిన వాళ్లకు వీసా ఇంటర్వ్యూలు తప్పనిసరి అన్న నిబంధన ఉంది. ఇలాంటి వారికి వెయిటింగ్ టైం ఇంకా పెరుగుతుండటంతో ఇప్పుడు విదేశాల్లోని ఎంబసీలకు వెళ్లే చాన్స్ ఇస్తున్నట్లు యూఎస్ అధికారులు తెలిపారు. ‘‘ఉదాహరణకు బీ1, బీ2 వీసాల అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్ టైం కోల్ కతాలో 589 రోజులు, ముంబైలో 638 రోజులు ఉంది. కానీ థాయిలాండ్ లోని బ్యాంకాక్​లో ఉన్న యూఎస్ ఎంబసీలో అయితే.. 14 రోజుల్లోనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. అంటే.. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఆ తేదీకల్లా బ్యాంకాక్ పోయి ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది” అని వారు వెల్లడించారు. ఇలా వేరే దేశానికి వెళ్లి అయినా అమెరికా వీసాలు పొందేందుకు ఇప్పటికే చాలా మంది ప్రయత్నాలు మొదలుపెట్టారని ట్రావెల్ ఏజెంట్స్ సంఘాలు చెప్తున్నాయి. సింగపూర్, థాయిలాండ్, వియత్నాంతో పాటు జర్మనీ, బ్రెజిల్ వంటి దేశాల్లోని యూఎస్ ఎంబసీల్లో ఈ చాన్స్ ఇస్తున్నట్లు పేర్కొంటున్నాయి. 

మన దేశంలో అయితే 500 రోజులపైనే..  

పోయిన ఏడాది బీ1, బీ2 వీసాల అపాయింట్మెంట్లకు ఏకంగా వెయ్యి రోజుల వరకూ వెయిటింగ్ టైం ఉండేది. అందుకే ఎక్కువ మంది ఇండియన్ వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను అమెరికా రద్దు చేసింది. అలాగే, ఫస్ట్ టైం అప్లికెంట్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు, కాన్సులేట్లలో సిబ్బంది సంఖ్య పెంపు, శనివారాల్లో కూడా ఇంటర్వ్యూల నిర్వహణ వంటి చర్యలు చేపట్టింది. గతంలో యూఎస్ వీసా ఉండి, ఇంటర్వ్యూ రద్దుకు అర్హత పొందినోళ్లకు రిమోట్ ప్రాసెసింగ్ ను కూడా ప్రారంభించింది. దీంతో ప్రస్తుతం బీ1, బీ2 వీసాల అపాయింట్మెంట్లకు వెయిటింగ్ టైం ముంబైలో 638 రోజులు, చెన్నైలో 617 రోజులు, హైదరాబాద్ లో 609 రోజులు, ఢిల్లీలో 596 రోజులు, కోల్ కతాలో 589 రోజులకు తగ్గింది. అయితే, ఎఫ్1 (స్టూడెంట్) వీసాల అపాయింట్మెంట్లకు మాత్రం వెయిటింగ్ టైం అత్యధికంగా 90 రోజులకు తగ్గింది.'