హాస్పిటల్లో డిప్లొమా పట్టా

హాస్పిటల్లో డిప్లొమా పట్టా

డిగ్రీ పట్టా అందుకునే రోజు ఎవరికైనా జీవితంలో మర్చిపోలేని రోజు. టీచర్లు, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్​ చప్పట్లు కొడుతుంటే స్టేజీ మీదకు వెళ్లి సర్టిఫికెట్ అందుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. జడా సెలెస్​ కూడా ఆ ఆనందాన్ని మిస్​ కావద్దు అనుకుంది. అమెరికాలోని డిల్లార్డ్ యూనివర్సిటీలో డిప్లొమా చేసింది. అయితే అప్పటికే ఆమె తొమ్మిది నెలల గర్బిణి. అయినా సరే... ఎలాగైనా డిప్లొమా కాన్వకేషన్ సెర్మనీకి వెళ్లాలి అనుకుంది. కానీ,  పురిటినొప్పులు రావడంతో సెలెస్​ని కాన్వకేషన్ సెర్మనీకి ముందు రోజే (ఈనెల 13న) హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తెల్లారే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన సంతోషం ఒక వైపు, కాన్వకేషన్ ఈవెంట్​కి వెళ్లలేకపోయాననే బాధ మరోవైపు ఆమెలో. తాను కాన్వొకేషన్​కి ఎందుకు రాలేకపోయిందో యూనివర్సిటీ డైరెక్టర్ వాల్టర్ కిమ్​బ్రోగ్​కి మెసేజ్​ చేసింది. ఆ మెసేజ్​ చదివిన ఆయన సెలెస్​ని సర్​ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఆమె ఉన్న హాస్పిటల్​కి వెళ్లాడు. కాన్వకేషన్​ వేడుకలో ఎలాగైతే పేరు చదువుతారో.. అలానే సెరెస్ పేరు చదివి, డిప్లొమా పట్టా అందించాడు.  కాన్వకేషన్ గౌన్ వేసుకుని, తలపై టోపీ పెట్టుకుని డిప్లొమా పట్టా అందుకుంది. ఒక చేతిలో బిడ్డ. మరో చేతిలో డిప్లొమా పట్టా పట్టుకొని మురిసిపోతున్న సెలెస్ వీడియో ఇంటర్నెట్​లో వైరల్​ అవుతోంది.