కేసుల పరిష్కారానికి లేటెస్ట్ టెక్నాలజీ వాడాలి :  సీఎస్ రామకృష్ణారావు

కేసుల పరిష్కారానికి లేటెస్ట్ టెక్నాలజీ వాడాలి :  సీఎస్ రామకృష్ణారావు
  • ఇతర రాష్ట్రాలలో ఉన్న మానిటరింగ్​ వ్యవస్థను స్టడీ చేయాలి
  • అధికారులకు సీఎస్​ రామకృష్ణారావు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పేరుకుపోయిన కేసులను తగ్గించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని అధికారులను సీఎస్​ కె.రామకృష్ణారావు ఆదేశించారు. సెక్రటేరియెట్ లో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంతో పాటు కేసుల పురోగతిని పర్యవేక్షించడం, డిజిటల్  రికార్డులను నిర్వహించడం, సమాచార వ్యవస్థలో పారదర్శకతను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.

సుప్రీంకోర్టుతో పాటు బిహార్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్  వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మానిటరింగ్  వ్యవస్థను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణలో అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.  లేటెస్ట్  సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుపరిపాలనలో పారదర్శకతను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ వ్యవస్థలు ‘రైజింగ్ తెలంగాణ - 2047’  లక్ష్య సాధనకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. న్యాయ, రెవెన్యూ, హోం శాఖల అధికారులు ఎన్‌‌‌‌ఐసీతో సంప్రదించి, వారం రోజుల్లోగా ఒక సమగ్ర కార్యాచరణ నివేదికను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు.